New Delhi, August 10: రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని కట్టబెడుతూ తీసుకువచ్చిన బిల్లుపై (Constitutional Amendment Bill 2021) మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో విపక్షాలు ప్రభుత్వానికి అంతకుముందే మద్దతు ప్రకటించాయి. హాజరైన మొత్తం 385 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు.
127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు (OBC Bill 2021) పూర్తి న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులాధారిత జనగణన జరగాలని చర్చ సందర్భంగా జేడీయూ, బీఎస్‌పీ, ఎస్‌పీ, డీఎంకే డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి వద్దని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం (Lok Sabha Passes Key Bill) లభించింది.
జూలై 19న వర్షాకాల సమావేశాల ఆరంభం తర్వాత లోక్‌సభలో ఒక బిల్లుపై సాఫీగా చర్చ జరిగి ఆమోదం పొందడం ఇదే తొలిసారి. బిల్లుకు కొన్ని సవరణలను విపక్షాలు సూచించినా వాటికి ఆమోదం లభించలేదు. ఇది రాజ్యాంగసవరణ బిల్లు కావడంతో పార్లమెంట్ రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో (హాజరైన వారిలో మూడింట రెండొంతల మంది ఆమోదం) ఆమోదం పొందాల్సి ఉంటుంది. తాజాగా ఆమోదం పొందడంతో ఈ బిల్లు వాస్తవరూపం దాల్చింది.
ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్న ప్రతిపక్షాలు, బిల్లులో పేర్కొన్న రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. బిల్లుకు మద్దతిస్తామని, అయితే రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న పరిమితిని తీసివేయాలని అధిర్ రంజన్ చర్చ సందర్భంగా కోరారు. సుప్రీంకోర్టు మండల్ తీర్పు ద్వారా 30 ఏళ్ల క్రితం విధించిన ఈ పరిమితి సడలించాలని ఎస్‌పీ, డీఎంకే సైతం డిమాండ్ చేశాయి.
ఈ విషయంపై సంపూర్ణ అధ్యయనం జరగాల్సి ఉందని మంత్రి వీరేంద్ర కుమార్ జవాబిచ్చారు. విపక్షాల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందన్నారు. కానీ కోర్టులు ఈ విషయంలో స్థిరంగా వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు. అందువల్ల దీనికి సంబంధించిన న్యాయ, చట్టపరమైన అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చన్న ఇందిరా సాహ్నీ కేసులో కోర్టు తీర్పును గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం పేద, దళిత, ఓబీసీల ప్రయోజనాలకు అన్ని చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖా మంత్రి భూపేందర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓబీసీలపై ప్రేమే ఉంటే నలభై ఏళ్లుగా కాంగ్రెస్ ఏమి చేసిందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కూడా కల్పించలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ పని జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ఉద్దేశం రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే వీలు కల్పించడమేనని చెప్పారు. ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఘనత మహారాష్ట్ర ప్రభుత్వానిది. ఓబీసీ రిజర్వేషన్లపై మా ప్రభుత్వ యత్నాల వల్లనే ఈ బిల్లుకు రూపం వచ్చింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించకుండా ఈ బిల్లుకు పరిపూర్ణత రాదు’’ అని ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.
ఓబీసీ బిల్లు ఎందుకు
జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 5న కీలకమైన తీర్పు చెప్పింది. ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వడానికి, సామాజికంగా – విద్యాపరంగా వెనుకబడిన వ్యక్తులకు ప్రవేశం కల్పించే హక్కు రాష్ట్రాలకు లేదని ఈ ఏడాది మే 5 న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్‌ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది.
ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది. దీన్ని 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా మంత్రి వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు.
ఇందుకోసం అధికరణ 342ఏతో పాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని వీరేంద్రకుమార్ తెలిపారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభించిన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఓబీసీ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నట్టు చెప్పారు. 2018లో చేసిన 102 రాజ్యాంగ చట్ట సవరణను ఆయన తప్పుబట్టారు. నాడు ప్రతిపక్షాలు చేసిన సూచన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
కొత్త బిల్లులో ఏముంది?
రాజ్యాంగంలోని 102 వ సవరణలోని కొన్ని నిబంధనలను స్పష్టం చేయడానికి ఈ బిల్లు తీసుకురాబడింది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత, రాష్ట్రాలకు మరోసారి వెనుకబడిన కులాలను జాబితా చేసే హక్కు లభిస్తుంది. ఏదేమైనా, 1993 నుండి, కేంద్రం, రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ఓబీసీల ప్రత్యేక జాబితాలను తయారు చేస్తున్నాయి. అయితే, 2018 రాజ్యాంగ సవరణ తర్వాత ఇది జరగలేదు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, పాత విధానం మళ్లీ అమలు చేస్తారు. దీని కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A సవరణ జరుగుతోంది. దీనితో పాటు, ఆర్టికల్ 338B మరియు 366 లో సవరణలు కూడా చేశారు.
బిల్లు ఆమోదం పొందితే వచ్చే మార్పేమిటి?
ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం ప్రకారం వివిధ కులాలను ఓబీసీ (OBC) కోటాలో చేర్చగలుగుతాయి. ఇది హర్యానాలో జాట్‌లు, రాజస్థాన్‌లోని గుజ్జర్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లకు మార్గం సుగమం చేస్తుంది. ఈ కులాలు చాలా కాలంగా రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయి.
అయితే, ఇందిరా సాహ్నీ కేసును ఉదహరిస్తూ సుప్రీం కోర్టు వారి డిమాండ్లపై స్టే విధించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే, కొత్త కులాలను ఓబీసీలో చేర్చడానికి రాష్ట్రాలకు అధికారం లభిస్తుంది. అయితే రిజర్వేషన్ పరిమితి ఇప్పటికీ 50%గానే ఉంటుంది. ఇందిరా సాహ్నీ కేసు నిర్ణయం ప్రకారం, ఎవరైనా 50%పరిమితికి మించి రిజర్వేషన్ ఇస్తే, సుప్రీం కోర్టు దానిని నిషేధించవచ్చు. ఈ కారణంగా అనేక రాష్ట్రాలు ఈ పరిమితిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇందిరా సాహ్నీ కేసు ఏమిటి?
పివి నరసింహారావు ప్రభుత్వం 1991 లో, ఆర్థిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీకి 10% రిజర్వేషన్ కల్పించింది. జర్నలిస్ట్ ఇందిరా సాహ్నీ రావు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. సాహ్ని కేసులో, రిజర్వేషన్ కోటా 50%మించరాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం తరువాత, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం జరగదని ఒక చట్టం రూపొందించారు. ఈ కారణంగా, రాజస్థాన్‌లో గుర్జర్లు, హర్యానాలో జాట్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు రిజర్వేషన్ కోసం అడిగినప్పుడు, సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటుంది. దీని తరువాత కూడా, అనేక రాష్ట్రాలు ఈ నిర్ణయం నుండి బయటపడ్డాయి. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తూ వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, హర్యానా, బీహార్, గుజరాత్, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో మొత్తం రిజర్వేషన్ 50%కంటే ఎక్కువ.
విపక్షాలు చాలా కాలంగా కుల గణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత, హర్యానా, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు జాట్, పటేల్, లింగాయత్ కులాలను ఓబిసిలో చేర్చడం ద్వారా ఎన్నికల ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేస్తాయి. హర్యానాలో జాట్‌లు లేదా గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లు లేదా మహారాష్ట్రలోని మరాఠాలు ఎవరైనా సరే తమ తమ రాష్ట్రాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ కులాల ఓటు బ్యాంకును పొందటానికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వాటిలో రిజర్వేషన్ కూడా ఒకటి.