RBI on Rs 2000 Notes: రెండు వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన, ఇంకా మార్కెట్లో రూ.84 వేల కోట్ల విలువైన నోట్లు, బ్యాంకులకు తిరిగి వచ్చింది రూ.2.72 లక్షల కోట్లు
జూన్ 30 నాటికి 76 శాతం వరకు 2 వేల నోట్స్ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది.
New Delhi, July 3: రూ.2,000 నోట్లను (మే 19న) ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30 నాటికి 76 శాతం వరకు 2 వేల నోట్స్ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లని ఆర్‌బీఐ తెలిపింది. అత్యధికంగా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేశారని తెలిపింది.
రూ.2000 కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం గత నెలాఖరు (జూన్ 30) నాటికి రూ.2.72 లక్షల కోట్ల విలువైన రూ.2000నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ వివరించింది.
ఇకపై ప్రతి రాజకీయ పార్టీ లెక్కలు చూపాల్సిందే, కొత్త ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించిన ఎన్నికల సంఘం
ప్రస్తుతం మార్కెట్లో ఇంకా రూ.84 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మే 19 నుంచి జూన్ 30 వరకు రూ.2000కరెన్సీ నోట్లు 76 శాతం తిరిగి వెనక్కి వచ్చాయని తేలింది. 87 శాతం నోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా, మిగతా 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లతో మార్పిడి జరిగిందని తెలిపింది.
మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు తరువాత నవంబర్ 2016లో రూ. 2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. అయితే 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చాలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. ఇందులో 76శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి.