ATM Robbery: పట్టపగలే నగరం నడిబొడ్డున లూటీ, ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి లక్షలతో ఉడాయించిన దుండగులు, కలకలం రేపుతోన్న కూకట్‌పల్లి దోపిడీ ఘటన
పట్టపగలే బిజీగా ఉండే రోడ్డు పక్కన ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డు, మరొక వ్యక్తిపై కాల్పులు జరిపి క్యాష్ తో ఉడాయించారు. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే ఈ ఘటన జరిగిపోయింది...
Hyderabad, April 29: హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బిజీగా ఉండే రోడ్డు పక్కన ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డు, మరొక వ్యక్తిపై కాల్పులు జరిపి క్యాష్ తో ఉడాయించారు. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే ఈ ఘటన జరిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే, కూకట్‌పల్లిలోని పటేల్ కుంట పార్క్ సమీపంలో గురువారం HDFC బ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో క్యాష్ నింపేందుకు బ్యాంక్ సిబ్బంది మెషీన్ తెరిచారు. ఇంతలోనే కొంతమంది దుండగులు చొరబడి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బుతో అక్కడ్నించి ఎస్కేప్ అయ్యారు. సుమారు రూ.5 లక్షలు దోచుకెళ్లినట్లు సమాచారం.
ఇక ఈ కాల్పుల్లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్, బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అలీ బేగ్ మృతి చెందాడు, శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో 2 బుల్లెట్లు, బుల్లెట్ లాక్‌ను స్వాధీనపరుచుకున్నారు. ఈ సంఘటన వెనుక దోపిడీ ముఠా ఉందని వారు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోఇ సిసిటివి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.