SC on Class 12 Results: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం, ఒక్కో విద్యార్థికి కోటి పరిహారం ఇవాల్సి ఉంటుందని హెచ్చరిక; జూలై 31లోపు ఫలితాల వెల్లడికి ఆదేశం

కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీం హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా వ్యవహరించాలనుకుంటుందని సుప్రీం ప్రశ్నించింది...

Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, June 24: వచ్చే నెల జూలై 31 లోగా 12వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రకటించాలని అన్ని రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించి విధివిధానాలను 10 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు ఈ ఏడాది పరీక్షలను రద్దు చేయగా, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల నిర్వహణను పూర్తి చేశాయి. అయితే మరికొన్ని రాష్ట్రాలు మాత్రం కోవిడ్ -19 పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణకు పట్టుదలగా ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అలాగే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక యోచిస్తుండగా, ఇప్పటికే 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన కేరళ 11వ తరగతి విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.

అయితే సుప్రీంకోర్టులో వాదనల అనంతరం దాదాపు మిగతా రాష్ట్రాలు పరీక్షల రద్దుకు అంగీకరించగా, ఆంధ్ర ప్రదేశ్ మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. ఈ సందర్భంగా ఏపి తరఫు న్యాయవాదికి సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

ఏపి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలను ప్రస్తావిస్తూ  కరోనా సమయంలో 15 నుంచి 18 మంది విద్యార్థులను ఒకే గదిలో ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించింది. అందుకోసం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ సరిపోయే విధంగా 34,634 గదులు అవసరం, ఈ సంఖ్యను మీరు ఎలా సర్దుబాటు చేస్తారు?  బహిరంగం ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?  అని ధర్మాసనం  ప్రశ్నించింది. ఒక్క విద్యార్థికి ప్రాణాపాయం ఏర్పడినా రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీం హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా వ్యవహరించాలనుకుంటుందని సుప్రీం ప్రశ్నించింది. ఏపి ప్రభుత్వ సమాధానాలతో తాము సంతృప్తి చెందకపోతే ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.



సంబంధిత వార్తలు