Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం,'బాలికలతో అసభ్యంగా ప్రవర్తించం', ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలురతో ప్రతిజ్ఞ చేయించాలంటున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: IANS)

New Delhi, December 13: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల (government and private schools)బాలికలతో ఎప్పుడూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించం అని బాలురతో ప్రతిరోజూ ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi Chief Minister Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో అమలు చేస్తామన్నారు.

ఢిల్లీలో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాల్లో బాలికల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. బాలికల పట్ల బాలురు అసభ్యంగా ప్రవర్తించే సహించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు.

బాలబాలికలు సోదరభావంతో మెలగాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమారుల ప్రవర్తనను అబ్జర్వ్‌ చేయాలి. బయట అమ్మాయిలను వేధించినట్లు తెలిస్తే ఇంట్లోకి రానివ్వమనే ఆదేశాలు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలని సీఎం చెప్పారు. నిర్భయ కేసు విషయంలో ఉరి తీసేందుకు కావాల్సిన చర్యలను త్వరగా పూర్తి చేసి ఉరి తీస్తే బాగుంటుందని ఢిల్లీ సీఎం తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వ చర్యల ఫలితంగా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ బడులు మెరుగైన ప్రగతి సాధించాయి. ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ అనే వెబ్‌సైట్‌ నివేదికలో దేశంలోని టాప్‌ 10 పాఠశాల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజ్‌కీయ ప్రతిభా వికాస్‌ విద్యాలయ (ఆర్పీవీవీ) మొదటి స్థానంలో నిలిచింది. దీనితో పాటు ఢిల్లీలోని మరో రెండు ప్రభుత్వ పాఠశాలలు టాప్‌ 10 స్థానం సంపాదించాయి.