COVID-19 In India: కోవిడ్19 బారిన పడిన రెండో కేరళ విద్యార్థి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, ముగ్గురిలో ఇప్పటికే ఇద్దరు డిశ్చార్జ్, కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి లేదని ప్రకటించిన ఆ రాష్ట్ర మంత్రి

పాజిటివ్ కేసులుగా నమోదైన వారి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడటంతో పాటు, వారి నమూనాల్లో వైరస్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో, అనేక సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు......

Coronavirus Screening | (Photo Credits: AFP)

 Kasargod , February 17: కేరళ (Kerala) రాష్ట్రానికి నోవెల్ కరోనావైరస్ (Coronavirus) లేదా కోవిడ్ -19 (COVID 1)  ప్రమాదం నుంచి భారీ ఊరట కలిగించే విషయం ఇది. కరోనావైరస్ బారిన పడిన కేరళ వాసులు క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఇటీవలే తొలి కోవిడ్19 పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, తాజాగా మరో విద్యార్థిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదివే ఓ వైద్య విద్యార్థిని జనవరి 24న తన స్వస్థలం కేరళ తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 02న వైద్యాధికారులు ఆమెకు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్పట్నించి ఆమెను కాసర్గోడ్ జిల్లాలోని ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వరుసగా ఆమెకు వారం రోజుల పాటు మళ్ళీ మళ్ళీ కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అన్ని పరీక్షల్లో 'నెగెటివ్' అని రావడంతో ఆదివారం ఆ యువతిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమెను మరో రెండు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాల్సిందిగా సూచించారు.

కరోనావైరస్ బారిన పడిన కేరళకు చెందిన ముగ్గురిలో ఇప్పటివరకు ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. మరొక్క రోగి మాత్రమే ఇప్పుడు త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారే ముందుగా ఆసుపత్రిలో చేరిన వారు కావడం ఇక్కడ గమనార్హం.

భారతదేశంలో నమోదైన తొలి మూడు కరోనావైరస్ పాజిటివ్ కేసులు కేరళ రాష్ట్రం నుంచే నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు చైనాలోని వుహాన్ నగరం నుంచి తిరిగి వచ్చిన వారే.

కాగా, ఇండియాలో తొలి పాజిటివ్ కేసుగా నమోదైన త్రిశూర్ కు చెందిన విద్యార్థి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. రెండవ, మూడవ పాజిటివ్ కేసులుగా నమోదైన వారి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడటంతో పాటు, వారి నమూనాల్లో వైరస్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో, అనేక సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

కరోనావైరస్ యొక్క రెండవ కేసు అలప్పుజ నుంచి ఫిబ్రవరి 13న డిశ్చార్జ్ అయ్యాడు. అతడు మరికొన్ని రోజులు గృహ నిర్బంధంలో ఉండనున్నాడు. మూడో కేసుగా ఆసుపత్రిలో చేరిన యువతి, నిన్న ఫిబ్రవరి 16న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఈమె కూడా 2 వారాల పాటు గృహనిర్భంధంలో ఉండనుంది. ఇక తొలి కేసుగా జనవరి 30న ఆసుపత్రిలో చేరిన విద్యార్థి మాత్రం ఇంకా డిశ్చార్జ్ కాలేదు, అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

కేరళలో కరోనావైరస్ యొక్క ద్వితీయ వ్యాప్తి లేదని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ చేసిన కృషికి ఆయన అభినందనలు తెలిపారు.