COVID19 in India: భారత్‌లో 17 లక్షల 50 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీగా 54,735 కేసులు నమోదు, 37 వేలు దాటిన కరోనా మరణాలు
ఇప్పటివరకు 11,45,630 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 5,67,730 ఆక్టివ్ కేసులు ఉన్నాయని...
New Delhi, August 2: భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 54,735 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 17,50,723 కు చేరింది. నిన్న ఒక్కరోజే 853 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 37,364 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 51,256 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 11,45,630 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 5,67,730 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
కరోనావైరస్ టెస్టుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో 4,63,172 శాంపుల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఆగష్టు 1 వరకు మొత్తంగా 1,98,21,831 టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.
ఇక జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 17.5 మిలియన్ల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడగా, 6.8 లక్షలకు పైగానే మరణాలు సంభవించాయి.
ఆదివారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 17,791,377కు చేరగా, నేటి ఉదయం వరకు 683,988 కరోనా మరణాలు సంభవించాయని CSSE తాజాగా నివేదించింది.