Govt Warns Twitter: సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు లోబడి పనిచేయాలి! వివాదాస్పద సందేశాల పట్ల ట్విట్టర్ సంస్థకు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఇటీవల అమెరికాలో కాపిటల్ హిల్ సంఘటన పట్ల ఈ సోషల్ మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు, దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనల పట్ల వ్యవహరించిన తీరును మంత్రి ఎండగట్టారు.....
New Delhi, February 12: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు నకిలీ వార్తలను లేదా హింసను ప్రేరేపించేలా ఉండే సమాచారాన్ని ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మరోసారి హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ ఆ హక్కును కల్పించే ఆర్టికల్ 19ఎ కొన్ని ఆంక్షలకు లోబడి ఉంటుందని" అని కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో చెప్పారు. భారత చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
" సోషల్ మీడియాను మేము చాలా గౌరవిస్తాము, ఇది సామాన్య ప్రజలను శక్తివంతం చేసింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాకు ప్రముఖ పాత్ర ఉంది. అయితే, నకిలీ వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే, అది ట్విట్టర్ అయినా ఫేస్ బుక్ అయినా లేదా ఇంకేదైనా.. సామాజిక దుర్వినియోగంపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, భారత రాజ్యాంగం ప్రభుత్వంపై మరియు ప్రధానమంత్రిపై విమర్శలను అనుమతిస్తుంది, అయితే అందుకు కొంత పరిమితి ఉంటుందని పేర్కొన్నారు.
" కొన్ని సమస్యలను ట్విట్టర్‌కు దృష్టికి తీసుకొచ్చాము, భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటే భారత చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల అమెరికాలో కాపిటల్ హిల్ సంఘటన పట్ల ఈ సోషల్ మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు, దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనల పట్ల వ్యవహరించిన తీరును మంత్రి ఎండగట్టారు. పరాయి దేశం పట్ల పరాయిగా వ్యవహరించకూడదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. "రైతుల ఆందోళనను అదనుగా చూసుకొని రెచ్చగొట్టే ట్వీట్లను తొలగించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుపై ట్విట్టర్ స్పందించకపోవటం పట్ల రవిశంకర్ ఆ సంస్థ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర హెచ్చరికలతో ట్విట్టర్ దిగొచ్చింది, ఉద్యమాన్ని పక్కదారి పట్టేంచేటట్లు అనిపించే దాదాపు 97 శాతం ట్వీట్లను తొలగించినట్లు సమాచారం