Ayodhya Verdict: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ నుంచి అడ్వైజరీ జారీ
అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది....
New Delhi, November 7: వచ్చే వారం అతి సున్నితమైన బాబ్రీ మసీదు-రామ్ జన్మభూమి (Babri Masjid-Ram Janmabhoomi) వివాదం కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తన తుది తీర్పును ఇస్తుందని భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు వెలువడిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలోని పరిపాలన విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, పటిష్ఠమైన భద్రతను అమలు పరచాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) అడ్వైజరీ జారీ చేసింది.
ఇక ముందు జాగ్రత్తగా అయోధ్య పట్టణాన్ని కేంద్రం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా దళాలతో పటిష్ఠమైన రక్షణ వలయాన్ని ఏర్పర్చింది. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన 4,000 మంది సిబ్బందిని అయోధ్యకు పంపించింది. మొత్తం 13 సిఆర్పిఎఫ్ కంపెనీల బలగాలు నవంబర్ 11న అయోధ్యకు చేరుకుని, నవంబర్ 18 వరకు మోహరించబడతాయి.
అయోధ్యలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియాపైనా కేంద్రం ఆంక్షలు విధించింది. మత సంబంధమైన, దేవతలపైనా ఎలాంటి పోస్టులు కూడా ఉండకూడదని, అలాంటి వాటిపై నిషేధం విధించింది. డిసెంబర్ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడిన తర్వాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మరియు ఎస్ఎంఎస్ ద్వారా వ్యాప్తి చెందే పుకార్ల పట్ల నిఘా నేత్రం ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 'అయోధ్య' విషయంలో అనవవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు, మంత్రులకు ప్రధాని సూచన
దశబ్దాల తరబడిగా వివాదంగా కొనసాగుతున్న అయోధ్య కేసుకు ముగింపు ఇవ్వాలని జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ ప్రాతిపదికన 40 రోజుల పాటు విచారించింది. అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది. ఈ నవంబర్ 17లోపు ఆ చారిత్రత్మకమైన తీర్పు వెలువడనుంది.