CAA Row: పౌరసత్వ సవరణ చట్టంపై 'స్టే' ఇచ్చేందుకు సుప్రీంకోర్ట్ నిరాకరణ, విచారణలకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు, పిటిషన్లపై 4 వారాల్లో స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం
రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సూచనలు ఇచ్చింది. ఇక అస్సాం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని....
New Delhi, January 22: పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) కు వ్యతిరేకంగా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినకుండా ఆ చట్టాన్ని ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమని సుప్రీం స్పష్టం చేసింది.
అయితే ఈ పిటిషనన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. సిఎఎ చట్టబద్ధతపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్ట్ తెలిపింది. అప్పటివరకు సిఎఎపై హైకోర్టులు కూడా ఎలాంటి పిటిషన్లను స్వీకరించకూడదని, అలాగే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
Citizenship Amendment Act (CAA) చట్ట విరుద్ధమైందంటూ డిసెంబర్ 18న సుప్రీంకోర్టులో దాదాప్ 60 పిటిషన్లు దాఖలయ్యాయి, ఆ తర్వాత వీటి సంఖ్య 140కి పైగా పెరుగుతూ పోయింది. వీటన్నింటిపై జనవరి 22న విచారణ చేపడతామని సుప్రీం ప్రకటించిన నేపథ్యంలో నేడు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. సీనియర్ కౌన్సెల్ వికాస్ సింగ్ ఈ రోజే పౌరసత్వ సవరణ చట్టం అమలుపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని కోర్టును కోరారు. అందుకు చీఫ్ జస్టిస్ బొబ్డే స్పందిస్తూ "వీటి కాపీలను కేంద్రానికి పంపకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను మేము ఇవ్వబోము". అని తెలిపారు.
విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి, సిఎఎను సవాలు చేసే పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుని, ఈలోగా ఎన్‌పిఆర్ ప్రక్రియను కొన్ని నెలల వాయిదా వేయవచ్చని సూచించారు. అయితే కపిల్ సిబల్ యొక్క "స్టే" ప్రతిపాదనను ప్రభుత్వం తరఫు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వ్యతిరేకించారు. మరోవైపు సిఎఎను రాజ్యాంగబద్ధంగా ప్రకటించాలని కోరుతూ కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వారు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారు, ఏం చేస్తారో చేస్కోండి, మేము మాత్రం పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కి తగ్గం - అమిత్ షా
అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ప్రస్తుతానికి స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కేంద్రం ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సూచనలు ఇచ్చింది. ఇక అస్సాం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.