Amit Shah in Lucknow (Photo Credits: BJP Twitter)

Lucknow, January 21:  పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దూకుడు పెంచింది. ఎవరెన్ని నిరసనలు చేసిన సిఎఎను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  (Amit Shah) తేల్చి చెప్పారు.

మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పౌరసత్వ సవరణ చట్టంకు మద్దతుగా జరిగిన ర్యాలీలో (Pro- CAA Rally)  పాల్గొన్న అనంతరం అమిత్ షా ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లను పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ 'నేను ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నాను, ఎవరు ఎంత నిరసన తెలిపినా ఈ చట్టం (Citizenship Amendment Act) ఉపసంహరించబడదు.  సిఎఎపై ప్రభుత్వం వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని మళ్ళీ చెప్తున్నాను. వ్యతిరేకించే వారు, వ్యతిరేకించనీ.. మేము దేనికి భయపడము, ఇలాంటివి చాలా చూశాం' అని అమిత్ షా అన్నారు.  తెలంగాణలో ఎన్‌పిఆర్ నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తి

ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని తొలగించడం లేదు, కేవలం కొన్ని పార్టీలు ఈ చట్టంపై "అపార్థాన్ని" వ్యాప్తి చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాయని హోం మంత్రి అన్నారు. అసలు దేశ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. ఆ పార్టీ ఎప్పుడూ నిజాలను దాచిపెట్టి, అబద్ధాలను ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ నేతల కళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగుతో కప్పబడి ఉన్నాయి ఆ పార్టీ నేతలపై అమిత్ షా ధ్వజమెత్తారు. "రాహుల్ బాబా, అఖిలేష్ మరియు మమతా దీదీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్నారు." పౌరసత్వ సవరణ చట్టంపై బహిరంగ చర్చకు సిద్ధమని విపక్షాలకు అమిత్ షా సవాల్ విసిరారు.  ముల్లును ముల్లుతోనే! పౌరసత్వ సవరణ చట్టంపై ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ

విపక్షాలు సిఎఎ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుండటంతో దానికి కౌంటర్ గా బీజేపీ సిఎఎకు మద్ధతుగా దేశవ్యాప్త ర్యాలీలకు, అనుకూల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నేడు లక్నోలో సిఎఎ అనుకూల ర్యాలీని బీజేపి నిర్వహించింది. అంతకుముందు జనవరి 18న వారణాసిలో, జనవరి 19న గోరఖ్‌పూర్‌లో ఇలాంటి ర్యాలీలు జరిగాయి.

బుధవారం మీరట్‌లో కూడా సిఎఎ అనుకూల ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. ఇందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. అలాగే కాన్పూర్‌లో నిర్వహించే ర్యాలీలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొననున్నారు. ఇక గురువారం ఆగ్రాలో తలపెట్టిన ర్యాలీలో కొత్తగా ఎన్నికైన బీజేపి అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రసంగించనున్నారు.