Chandigarh, January 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) ను తమ రాష్ట్రంలో వ్యతిరేకిస్తూ సీఎం అమరీందర్ సింగ్ (Captain Amarinder Singh) నేతృత్వంలోని పంజాబ్ (Punjab) ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం శుక్రవారం అసెంబ్లీ ఆమోదం పొందింది. దీంతో దేశంలో సిఎఎ (Citizenship Amendment Act) ను అధికారికంగా తిరస్కరించిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రెండు రోజుల క్రితమే మంగళవారం నాడు కేరళ ప్రభుత్వం సిఎఎను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ పంజాబ్ ప్రభుత్వం రెండు రోజుల కొరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచింది. రెండో రోజు చట్ట సభలో రాష్ట్ర మంత్రి బ్రహ్మ్ మోహింద్రా సిఎఎ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో తీర్మానం సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు.
అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవేశపెట్టిన CAA, NRC మరియు NPR లు ప్రజలను విభజించేలా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, సిఎఎను రెండు రాష్ట్రాలు తిరస్కరించిన తర్వాత తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ సీఎం కేసీఆర్ (CM KCR) వైపు చూస్తుంది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ముస్లింల తరఫున గొంతుకగా నిలుస్తున్న AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) అప్‌డేషన్ ప్రక్రియ నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగజ్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అసద్, బీజేపీ ప్రభుత్వం చేపట్టనున్న NPR ప్రక్రియ ద్వారా తెలంగాణలోని ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, రైతులు మరియు పేదవారి హక్కులను దెబ్బతీస్తుందని తెలిపారు. NPR వల్ల పేద ప్రజలు అన్యాయానికి గురవుతారు, రాష్ట్రంలో NPR ప్రక్రియను తిరస్కరించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ 276 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ వెల్లడించారు.