File image of government officers gathering details of citizens. | File Photo

New Delhi, December 24:  దేశంలో జాతీయ జనాభా రిజిస్టర్ (NPR- National Population Register) ను నవీకరించటానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్రం రూ. 8,500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narend Modi) అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రతీ పౌరుడికి సంబంధించిన డేటాబేస్ తయారు చేయడమే ఈ ఎన్‌పిఆర్ అప్‌డేషన్ (NPR Updation) యొక్క లక్ష్యం అని సెన్సస్ కమీషన్ ఇదివరకే వెల్లడించింది. ఎన్‌పిఆర్ అప్‌డేట్ చేయడంలో భాగంగా, 2020 ఏప్రిల్ 1 నుండి 2020 సెప్టెంబర్ 30 వరకు ఐదు నెలల కాలంలో అస్సాం మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇంటింటికి జనాభా గణన నిర్వహించబడుతుంది.

దేశంలో ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) పై నిరసనలు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. దేశంలో నివసిస్తున్న వారి అందరికీ సంబంధించి సమగ్రమైన డేటా బేస్ లేదా వివరాల పట్టికను తయారు చేయడమే ఈ NPR అప్ డేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ప్రతి పౌరుడి వివరాలు నమోదు చేయబడతాయి. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం నుంచి నివసిస్తున్న వారు ఎన్‌పిఆర్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోని అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు అస్సాంలో ఇటీవల  నిర్వహించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియకు ఈ ఎన్‌పిఆర్ అనుసంధానించబడి ఉంది.  కాబట్టి ఆ రాష్ట్రంలో NPRను మినహాయించారు.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తరువాత, ప్రస్తుతం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సి)  మోదీ ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ముందడుగా ఈరోజు కేంద్ర కేబినేట్ NPRను ఆమోదించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమ రాష్ట్రంలో సహకరించమని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. అయితే అసలు NPR మరియు NRC కి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

పౌరసత్వ చట్టం 1955 మరియు పౌరసత్వం (పౌరుల నమోదు మరియు జాతీయ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు-2003,  ప్రకారం స్థానిక (గ్రామం / ఉప పట్టణం), ఉప జిల్లా, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఎన్‌పిఆర్ తయారు చేయబడుతుంది. భారతదేశంలోని ప్రతి నివాసి ఎన్‌పిఆర్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి.