Nirbhaya Case: అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, ఈ కేసులో రివ్యూలకు అవకాశమే లేదని వ్యాఖ్య, త్వరలోనే నలుగురికి ఉరిశిక్షలు అమలు, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు

ఇలాంటి రాక్షసుడిని సృష్టించినందుకు ఆ దేవుడు కూడా సిగ్గుపడతాడు. మానవత్వాన్నే చంపేసే నేరాలలో ఈ నేరం కూడా ఒకటి, కాబట్టి ఉరే సరైనది" అని నిర్భయ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు...

Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, December 18: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసు (Nirbhaya Case) లో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ (Akshay Kumar Singh) పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది.  బుధవారం అక్షయ్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్ (Supreme Court)  అసలు ఈ కేసులో రివ్యూ పిటిషన్లకు అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే చట్ట ప్రకారం ఉన్న గడువులోగా రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

సుప్రీంకోర్ట్ తాజా తీర్పుతో ఇక ఈ నలుగురు దోషులకు మరణశిక్ష అమలుకై మార్గం సుగమం అయింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో డెత్ వారెంట్ పై పటియాలా కోర్ట్ విచారణ చేపట్టి ఉరిశిక్షలు అమలు పరిచే తేదీని ఖరారు చేయనుంది.

అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్ ను విచారించేందుకు సీజేఐ ఎస్.ఎ. బొబ్డే నిరాకరించడంతో జస్టిస్ భానుమతి నేతృత్వంలో ఏస్ బోపన్న మరియు అశోక్ భూషన్ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

ఈ తీర్పుపై అక్షయ్ న్యాయవాది ఎపి సింగ్ స్పందిస్తూ తాము మరోసారి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేస్తామని, ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షను కోరతామని తెలిపారు.

అంతకుముందు విచారణ సందర్భంగా అక్షయ్ కుమార్ సింగ్ తరఫు న్యాయవాది ఎపి సింగ్ మాట్లాడుతూ, మీడియా అత్యుత్సాహం, రాజకీయ మరియు ఇతర ప్రజాసంఘాల ఒత్తిడి వల్లనే తన క్లయింట్ ను దోషిగా తేల్చారని అన్నారు. నిర్భయ ఆసుపత్రిలో మత్తులో ఉన్నప్పుడు మరణ వాంగ్మూలం ఇచ్చిందని, ఆ మత్తులో ఎక్కడా కూడా అక్షయ్ పేరును ప్రస్తావించ లేదని తెలిపారు. ఈ కేసులో నకిలీ నివేదికలు తయారు చేయబడ్డాయి, అందులో అక్షయ్ తప్పుగా చిక్కుకున్నారని కోర్టుకు తెలిపారు.

పుట్టుకతోనే ఎవరూ రేపిస్టులుగా మారరని, ఈ సమాజమే వారినలా మారుస్తుందని అన్నారు. అసలు దేశంలో మరణశిక్షను రద్దు చేయాలని కూడా వాదించారు. "ఉరిశిక్ష నేరస్థుడిని చంపుతుంది కానీ నేరాన్ని చంపదు " అంటూ ఎపి సింగ్ వాదనలు వినిపించారు.

మరోవైపు "దోషి పట్ల ఎలాంటి సానుభూతి చూపించకూడదు. ఇలాంటి రాక్షసుడిని సృష్టించినందుకు ఆ దేవుడు కూడా సిగ్గుపడతాడు. మానవత్వాన్నే చంపేసే నేరాలలో ఈ నేరం కూడా ఒకటి, కాబట్టి ఉరే సరైనది" అని నిర్భయ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునే సమర్థించింది, ఈ కేసులో ఉరిశిక్ష విధించడంలో తప్పేం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. అనంతరం అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.