Nirbhaya Case: తాను మైనర్ అంటూ నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్ట్, ఒకే వాదనను ఎన్నిసార్లు వినిపిస్తారంటూ న్యాయవాదిని మందలించిన ధర్మాసనం

పిటిషనర్ వాదనలు నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఒకేసారి తిరస్కరించిన అంశాన్ని మళ్ళీ లేవనెత్తడం సమంజసం కాదు, ఒకే అంశాన్ని ఎన్నిసార్లు వాదిస్తారు....

Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, January 20:  నిర్భయ ఘటనకు (2012 Nirbhaya Gang rape case)  సంబంధించి ఉరిశిక్ష పడిన దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా, ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ (juvenile ) అంటూ, ఆ ప్రకారంగా తిరిగి విచారణ చేపట్టాలని దాఖలు చేసుకున్న ప్రత్యేక లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court)  సోమవారం తిరస్కరించింది.

కోర్టు గదిలో పవన్ గుప్తాకు ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది ఏపి సింగ్, తన క్లయింట్ తనకు సమర్పించిన ధృవ పత్రాల ప్రకారం 2012లో అతడి వయసు కేవలం 17 సంవత్సరాల, 1 నెలగా అని పేర్కొన్నారు. కాబట్టి అతడ్ని ఈ కేసులో బాల్యనేరస్తుడిగా పరిగణించాలి అని వాదించారు.

అయితే వీరి వాదనలకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు వాదనలు వినిపించారు, ఇప్పటివరకు జరిగిన న్యాయ విచారణల సందర్భంగా దోషిని మేజర్‌గానే పరిగణించినట్లు గుర్తుచేశారు. కేవలం ఉరిశిక్షను తప్పించుకునేందుకు, ఈ తరహాలో కాలయాపన చేయటానికే పిటిషన్ వేశారని ఆరోపించారు.

ఇరుపక్షాల వాదనలపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం,  దోషి తరఫు న్యాయవాది వాదనలను తోసి పుచ్చింది. పిటిషనర్ వాదనలు నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఒకేసారి తిరస్కరించిన అంశాన్ని మళ్ళీ లేవనెత్తడం సమంజసం కాదు, ఒకే అంశాన్ని ఎన్నిసార్లు వాదిస్తారు అంటూ దోషి తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్ట్ మందలించింది.

కాగా, 2012 నిర్భయ కేసులో మొత్తం 6 మందిలో ఒకరు బాలనేరస్థుడు కాగా, మరొకడు జైలు ప్రాంగణంలోనే 2013లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురికి ఫిబ్రవరి 1న, ఉదయం 6 గంటలకు దిల్లీలోని తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.