Tamil Nadu: పెళ్లి వేడుకలు, క్రీడా మైదానాల్లో మద్యం అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ, ఆ ప్రదేశాల్లో మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అనుమతి ఇవ్వదని వెల్లడి
కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాల్లో మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదని తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి శెంథిల్ భాలాజీ అన్నారు.
Chennai, April 24: వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్.ఎల్.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకొచ్చిందనే వార్తలు వచ్చిన సంగతి విదితమే. తాజాగా ఈ వార్తలపై తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి శెంథిల్ భాలాజీ స్పందించారు.
కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాల్లో మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదని తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి శెంథిల్ భాలాజీ అన్నారు. సోమవారం కోయంబత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశ మందిరాలు, క్రీడా ప్రాంగణాల్లో మద్యం సరఫరాకు అనుమతిస్తూ మార్చి 18న తమిళనాడు ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌పై ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాల్లో మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అనుమతి ఇవ్వదని మంత్రి తెలిపారు.
అయితే అంతర్జాతీయ స్పోర్ట్స్ మీట్‌లు మరియు ఈవెంట్‌ల సమయంలో మద్యాన్ని అందించే విధానం ఇప్పటికే భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలులో ఉందని ఆయన అన్నారు.తమిళనాడులో సంపూర్ణ మద్య నిషేధం విషయంలో శక్తివంతమైన వన్నియార్ కమ్యూనిటీకి చెందిన రాజకీయ సంస్థ పట్టాలి మక్కల్ కట్చి (PMK) ముందంజలో ఉంది. పెళ్లి వేడుకలు, ఇతర బహిరంగ కార్యక్రమాల్లో మద్యం అమ్మకాలను అనుమతించే తమిళనాడు ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌పై మద్రాసు హైకోర్టును ఆశ్రయిస్తానని పీఎంకే నేత, న్యాయవాది కె. బాలు తెలిపారు.