Tamil Nadu: మహిళా ఐపీఎస్ అధికారిపై ప్రత్యేక డీజీపీ లైంగిక వేధింపుల కేసు, సీబీసీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ త్రిపాఠి, తమిళనాడు ప్రభుత్వం నిందితుడికి సహకరిస్తుందని ప్రతిపక్షాలు మండిపాటు
ఇందుకు తగ్గ ఉత్తర్వులను డీజీపీ త్రిపాఠి ఆదివారం జారీ చేశారు. కాగా ఉన్నతాధికారులకు ఆ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేయకుండా అనేక మంది అధికారులు అడ్డుకున్నట్టుగా సమాచారం
Chennai, Mar 1: తమిళనాడులో ఓ మహిళా ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురైన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. తన సహచర ఉద్యోగి,ఉన్నత హోదాలో ఉన్న పోలీస్ బాస్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆమె (Woman IPS officer) ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సెంట్రల్ జిల్లాల పర్యటన సందర్భంగా ఆమె వేధింపులకు (Sexually harassed) గురైనట్లు తెలుస్తోంది. లా&ఆర్డర్ స్పెషల్ డీజీపీ రాజేష్ దాస్ (DGP Rajesh Das) తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని మహిళా ఐపీఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో అతనిపై వేటు పడింది.
ఈ సమాచారం బుధవారం రాజకీయవివాదంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. ఆ మహిళా ఐపీఎస్ అధికారి ఇప్పటికే డీజీపీ త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులపై విచారణకు కమిటీని నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వేధింపులు ఇచ్చిన అధికారి డీజీపీ స్థాయి వ్యక్తి కావడంతో ఐఏఎస్ అధికారి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురితో కూడిన కమిటీ రంగంలోకి దించారు. ఈ కమిటీలో అదనపు డీజీపీ సీమాఅగర్వాల్, ఐజీ అరుణ్, డీఐజీ చాముండేశ్వరి, ఐపీఎస్ రమేష్‌బాబు, మహిళా స్వచ్ఛంద సేవకురాలు లోరెటా జోనా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Here's Kanimozhi Tweet
అయితే ప్రత్యేక డీజీపీ రాజేశ్‌దాస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు సీబీసీఐడీకి చేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులను డీజీపీ త్రిపాఠి ఆదివారం జారీ చేశారు. కాగా ఉన్నతాధికారులకు ఆ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేయకుండా అనేక మంది అధికారులు అడ్డుకున్నట్టుగా సమాచారం. దీనికి తోడు మానవ హక్కుల కమిషన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ త్రిపాఠిని మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల ప్రమేయంపై సమాచారం వస్తుండడంతో విచారణ వేగాన్ని పెంచేందుకు డీజీపీ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Here's Case Update
మరోవైపు ప్రతిపక్షాలు ఈ వేధింపుల ఘటనకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. నిందితుడిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని డీఎంకె అధినేత స్టాలిన్ ఆరోపించారు. ఇది అత్యంత అసహ్యకరమని... సిగ్గుచేటని విమర్శించారు. ధైర్యంగా ముందుకొచ్చి సదరు డీజీపీపై ఫిర్యాదు చేసిన ఆ మహిళా ఐపీఎస్‌కు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో పోలీస్ బాసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇదే తరహాలో... అగస్టు,2018లో అప్పటి తమిళనాడు యాంటీ కరప్షన్,డైరెక్టోరేట్ ఆఫ్ విజిలెన్స్ డైరెక్టర్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
తమిళనాడు మహిళా ఎస్పీ ఒకరు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ స్థాయి అధికారి నేత్రుత్వంలోని కమిటీతో అంతర్గత విచారణ చేపట్టారు. అయితే ఆ కమిటీ నిందితుడికే సహకరిస్తోందని... అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఆ మహిళా ఎస్పీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆ కేసు విచారణను అసాధారణ రీతిలో తెలంగాణ పోలీసులకు బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత నెల రోజులకే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.