Yadadri Now as Yadagirigutta: యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన
యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు
Hyd, Nov 8:యాదాద్రిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ తరహాలో ఈ బోర్డు ఉండేలా చూడాలన్నారు.
గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. గోసంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. కొండపై భక్తులు ఇబ్బందులు లేకుండా నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ చేయాలన్నారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
మూసీ పునరుద్ధరణ పాదయాత్ర కోసం ముఖ్యమంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి విమానంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం... లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వైటీడీఏ అధికారులతో సమావేశమయ్యారు.
ఆలయ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. యాదాద్రి అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న పనులపై సీఎం... అధికారులను అడిగి తెలుసుకున్నారు.