Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు, వచ్చే మూడు నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
ఎండ వేడిమి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది. ఈ ఉదయం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కాగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక శ్రీకాకుళంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
అయితే.. రాయలసీమ జిల్లాలలో ఇవాళ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాలులు కొనసాగినా.. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. బుధవారం నుంచి వాతావరణం చల్లబడొచ్చని చెబుతోంది. ఇంకోపక్క.. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మాత్రం వడగాడ్పులు వీయొచ్చని వాతావరణశాఖ అంచనా. హమ్మయ్యా.. రేపటి నుండి ఎండలు తగ్గి వర్షాలు, మే 10 వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
విదర్భ నుంచి తమిళనాడుకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వానలు, అలాగే ఏపీలో నాలుగు రోజులపాటు వానలు కురవనున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్, నగర శివారుతో పాటు మెదక్, సిద్ధిపేటలో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండలో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది.
ఇక కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి వల్ల నేటి నుంచి మూడు రోజులు పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కురుస్తాయని తెలిపింది. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.