TMC Minister Akhil Giri Apologizes: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రి, తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పిన అఖిల్ గిరి, విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు
నేను ప్రెసిడెంట్ అని అన్నాను, కానీ ఎవరి పేరును ఎత్తలేదని, ఒకవేళ భారత రాష్ట్రపతి తన వ్యాఖ్యల పట్ల అవమానంగా ఫీలయితే, దానికి తాను సారీ చెబుతున్నాని మంత్రి అఖిల్ గిరి అన్నారు.
Kolkata, NOV 12: పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరిపై (Akhil Giri ) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై (President Droupadi Murmu) ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. తృణమూల్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి అఖిల్ గిరి (Akhil Giri) క్షమాపణలు చెప్పారు. 17 సెకండ్లు ఉన్న ఓ వీడియో క్లిప్‌లో రాష్ట్రపతి ముర్ము (President Droupadi Murmu) గురించి మంత్రి గిరి అనుచిత కామెంట్ చేశారు. బీజేపీ వాళ్లకు తాను మంచి కనిపించడం లేదంటూ.. రూపం ద్వారా ఎవర్నీ అంచనా వేయలేమని, భారత రాష్ట్రపతిని గౌరవిస్తామని, కానీ ఆ రాష్ట్రపతి రూపం ఎలా ఉందంటూ మంత్రి గిరి వ్యాఖ్యలు చేశారు.
నందీగ్రామ్‌లో (Nandigram) ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ప్రెసిడెంట్ అని అన్నాను, కానీ ఎవరి పేరును ఎత్తలేదని, ఒకవేళ భారత రాష్ట్రపతి తన వ్యాఖ్యల పట్ల అవమానంగా ఫీలయితే, దానికి తాను సారీ చెబుతున్నాని మంత్రి అఖిల్ గిరి అన్నారు. మంత్రి గిరి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు తృణమూల్ పార్టీ పేర్కొన్నది. మంత్రి వ్యాఖ్యల్ని ఆ పార్టీ ఖండించింది. మంత్రి వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు. రాష్ట్రపతి ముర్ము పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి ముర్ముపై చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. క్యాబినెట్ నుంచి ఆ మంత్రిని తొలగించాలని సీఎం మమతా బెనర్జీని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ అంశంపై దీదీ వివరణ ఇవ్వాలన్నారు. బెంగాల్ సీఎం ఓ మహిళ అని, ఆమె క్యాబినెట్‌లో ఉన్న ఓ మంత్రి.. గిరిజన రాష్ట్రపతిపై కామెంట్ చేశారని, ఇది మన అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీస్తుందని, బెంగాల్ ప్రభుత్వం ఆదివాసీలను వేధిస్తున్నట్లు స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు.