Coronavirus in India: భారత్‌లో 43కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, కేరళలో 3 ఏళ్ల చిన్నారికి సోకిన వైరస్, కొత్తగా నమోదైన కేసులన్నీ విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారివే
ఇటీవల విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారందరూ తమ సమగ్ర ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆరోగ్య శాఖ కోరింది. కరోనావైరస్ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి హెల్ప్‌లైన్ వివరాలు: + 91-11-23978046, ncov2019@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.....
New Delhi, March 9: ఇండియాలో కరోనావైరస్ (COVID 19) పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus in India) రోజురోజుకి పెరుగుతున్నాయి. మార్చి 8 ఆదివారం నాటికి 40గా ఉన్న కేసులు, సోమవారం నాటి రిపోర్టులను పరిశీలిస్తే మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్క కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. ఇందులో 40 కేసులు కొత్తగా నమోదైనవే, అందులోనూ కేరళ నుంచే మరో 6 పాజిటివ్ కేసులు ఉన్నాయి, ఒక 3 ఏళ్ల చిన్నారికి కూడా కరోనావైరస్ సోకడం కలకలం రేపుతోంది. వీరంతా ఇటలీ వెళ్లి వచ్చిన వారే అని సమాచారం. కుటుంబంతో కలిసి ఇటీవలే ఇటలీ దేశంలో పర్యటించి మార్చి 07న ఇండియా వచ్చిన వీరికి కేరళలోని కోచి విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ఎర్నాకుళం ఆసుపత్రికి తరలించగా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారిని పేరేంట్స్ కు దూరంగా ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఇండియాలో తొలి మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే చికిత్స అనంతరం ఆ ముగ్గురు డిశ్చార్జి అయ్యారు, ఆ ముగ్గురు ఇప్పుడు కోలుకున్నారని కేరళ అధికారులు వెల్లడించారు. కాగా, ఆదివారం కొత్తగా మరో ఆరు కేసులు రాష్ట్రంలో నమోదు కావడంతో కేరళ ప్రభుత్వం మరోసారి హైఅలర్ట్ ప్రకటించింది. పతనమిట్ట జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది.
విదేశాల నుంచి వచ్చేవారికి కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా దిల్లీ విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని దిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇండియాలో కొత్తగా నమోదవుతున్న కరోనాకేసులు అన్నీ గమనిస్తే విదేశాల నుండి వచ్చిన వారే అవుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఇటీవల విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారందరూ తమ సమగ్ర ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆరోగ్య శాఖ కోరింది. కరోనావైరస్ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి హెల్ప్‌లైన్ వివరాలు: + 91-11-23978046, ncov2019@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.