Union Budget 2023: బడ్జెట్లో కనిపించని పోలవరం ప్రస్తావన, తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలమ్మ, బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఏం వచ్చాయంటే..
కేవలం యూనివర్సిటీలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
New Delhi, Feb 1: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను (Union Budget 2023) పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన గాయాలతోపాటు కరోనా సంక్షోభం రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే నేపథ్యంలో బడ్జెట్ (Union Budget 2023-24) మీద ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది.
అయితే విభజన చట్టం హామీల విషయంలో కేంద్రం నిరాశ కలిగించింది. పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో ఏపీ ప్రజల నుంచి తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కేవలం యూనివర్సిటీలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41,338 కోట్లు, తెలంగాణ వాటా రూ.21,470 కోట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పేరుని కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వైజాగ్ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించలేదు. చాలాకాలంగా ఉన్న డిమాండ్‌ను బడ్జెట్‌లో ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఓ సారి చూస్తే.
►తెలుగురాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు
►ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు
►ఏపీ పెట్రోలియం వర్శిటీకి రూ.168 కోట్లు
►విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు
►సింగరేణికి రూ.1650 కోట్లు
►ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు
►మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు
►సాలర్ జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు
►మణుగూరు, కోట భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు