Warangal Rape Case: కామోన్మాదికి ఉరిశిక్షను ఖరారు చేసిన వరంగల్ కోర్టు. ఏ కోర్టయినా ఇంతకంటే ఇంకేం చేయగలదు?
పోలీసులు, లాయర్లు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. 20 రోజుల్లోనే నేరారోపణ పత్రాలన్నీ పోలీసులు సిద్ధం చేసి...
అమ్మ ఒడిలో నిద్రిస్తున్న పసిపాపను చూస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుంది? ఎంతో ఆప్యాయకరమైన, భక్తి పూర్వకమైన భావన కలుగుతుంది. ఒక్క మనిషిలోనే కాదు, జంతువు అనే పిలవబడే వాటిలో కూడా ఇదే భావన ఉంటుంది. ఒక క్రూర మృగం కూడా దేనినైనా చంపి తింటుంది తప్ప ఇంకా అంతకుమించి ఎలాంటి పనిచేయదు. కానీ, మనుషుల్లోనే ఇంతటి ఉన్మాదులు ఉంటే వారిని ఏమనాలి? అలాంటి వారిని ఏం జంతువుతో పోల్చినా అది తప్పే అవుతుంది. ఏ క్రూరమృగంతో పోల్చినా అది తక్కువే అవుతుంది. తిట్టడానికి మాటలు, అలాంటి వారిపై రాయటానికి మనసొప్పదు, అయినా తప్పదు.
హన్మకొండ పట్టణంలో గత జూన్ నెలలో రాత్రి ఓ ఇంటి డాబాపైన అమ్మ ఒడిలో పడుకున్న 9 నెలల చిన్నారిని, ప్రవీణ్ అనే పేరు పెట్టుకున్న ఓ కామోన్మాది అర్ధరాత్రి అపహరించుకుపోయి, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ పసిబిడ్డపై అత్యాచారం చేశాడు. పాప ఏడవటంతో బయటకు శబ్దం రాకుండా అక్కడిక్కడే చంపేశాడు. చిన్నారి లేకపోవడం గమనించి తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, చుట్టుపక్కలంతా గాలించగా ప్రవీణ్ పట్టుబడ్డాడు, తమ బిడ్డను చూసి తల్లడిల్లిపోయారు. అక్కడ్నే ఆ కామోన్మాదిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. వెంటనే పాపను హాస్పిటల్ కు తీసికెళ్లినా పాప అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించటంతో ఆ తల్లిదండ్రుల దు:ఖానికి అంతులేకుండా పోయింది.
ఈ సంఘటన తెలిసి వరంగల్ సహా, రెండు తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పోలీసులు, లాయర్లు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. 20 రోజుల్లోనే నేరారోపణ పత్రాలన్నీ పోలీసులు సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు. 40 రోజుల్లోనే విచారణ ముగించిన వరంగల్ జిల్లా అదనపు కోర్టు, ఈ కేసులో ప్రవీణ్ ను దోషిగా నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. ఏ కోర్టైనా ఏం చేయగలదు, మన న్యాయవ్యవస్థ ప్రకారం ఒక దోషికి విధించబడే గరిష్టమైన శిక్ష ఉరిశిక్షే. కాబట్టి ఆ కామోన్మాదికి గరిష్ట శిక్షనే విధిస్తూ న్యాయమూర్తి జయకుమార్ తీర్పునిచ్చారు.