Bihar: బ్యాంకులో దొంగతనానికి వచ్చిన ముగ్గురు దొంగలపై తిరగబడిన మహిళా కానిస్టేబుళ్లు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
తుపాకీతో బెదిరించినా భయపడకుండా కలబడ్డారు. దీంతో దొంగలు ముగ్గురూ తోకముడిచారు.
బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ లో బ్యాంక్ లో చోరీ చేయడానికి వచ్చిన ముగ్గురు దొంగలను మహిళా కానిస్టేబుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. తుపాకీతో బెదిరించినా భయపడకుండా కలబడ్డారు. దీంతో దొంగలు ముగ్గురూ తోకముడిచారు. హాజీపూర్ లో సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుహి కుమారి, శాంతి కుమారి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తుంటారు.
బుధవారం కూడా ఎప్పట్లానే బ్యాంకు ముందు డ్యూటీలో ఉన్నారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకు లోపలికి వచ్చారు. వాళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఏం పనిమీద వచ్చారని జుహి కుమారి అడిగింది. బ్యాంక్ పాస్ బుక్ చూపించాలని అడగగా.. వచ్చిన వారిలో ఒక వ్యక్తి రివాల్వర్ బయటకు తీశాడు.దీంతో అప్రమత్తమైన జుహి, శాంతి తమ తుపాకులతో వారిని అడ్డుకున్నారు.
తల్లి సరిగా చూడటం లేదని తుఫాకీతో కాల్చి చంపిన కొడుకు, తికమ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన
వాళ్లు ముగ్గురు ఉన్నా, చేతిలో రివాల్వర్ ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ కలిసి దొంగలపై కలబడ్డారు. కానిస్టేబుళ్ల దగ్గరున్న తుపాకులను లాక్కోవడానికి దొంగలు విఫలయత్నం చేశారు. అయితే, కానిస్టేబుళ్లు మాత్రం వదలలేదు.
Here's Video
ఇక బ్యాంకులో దొంగతనం చేయడం కుదిరేలా లేదని గ్రహించి ఆ ముగ్గురూ పరారయ్యారు.ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా మెచ్చుకున్నారు.