COVID19 in India: భారత్‌లో 21 లక్షలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 61,537 కేసులు నమోదు, 42 వేలు దాటిన కరోనా మరణాలు
ఈ రాష్ట్రాల నుంచి వచ్చే కేసులతోనే భారతదేశంలోని కొవిడ్ కేసుల సంఖ్య ప్రతిరోజు 50 వేలకు పైగా పెరుగుతూపోతుంది. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ...
New Delhi, August 8: భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 61,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 20,88,612 కు చేరింది. నిన్న ఒక్కరోజే 933 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 42,518 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 48,900 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,427,005 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 619,088 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
దేశంలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి, 50వేలకు పైగా కేసులు గల రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, దిల్లీ లాంటి రాష్ట్రాలలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల సంఖ్య వేలల్లో ఉంటున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే కేసులతోనే భారతదేశంలోని కొవిడ్ కేసుల సంఖ్య ప్రతిరోజు 50 వేలకు పైగా పెరుగుతూపోతుంది. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో నిర్వహించే టెస్టుల సంఖ్య తక్కువగా ఉంటుండటంతో నిర్ధారించబడిన పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది.
అన్ని రాష్ట్రాలలో కెల్లా మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇప్పటికే కొవిడ్ బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరువలో 4,90,262 గా ఉంది, కరోనా మరణాల సంఖ్య 17,092కు పెరిగింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా గల కొవిడ్ కేసుల సంఖ్య 19.2 మిలియన్లు దాటగా, మరణాలు 719,000 కు పెరిగాయని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక పేర్కొంది.