Hunger Death: కాలినడకన 200 కి.మీ ప్రయాణం.. ఆకలి- దప్పికలతో ప్రాణాలు కోల్పోయిన వైనం. దయనీయ స్థితిలో మహిళ మృతి, విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం
మార్గమధ్యంలో కనీసం మంచి నీళ్లు అందించే వారు కూడా కరువయ్యారు. అలా మూడు రోజుల పాటు 230 కిలోమీటర్ల దూరం నడిచిన బాధితురాలు తీవ్రంగా నీరసించి మార్గమధ్యలోనే కుప్పకూలిపోయింది.....
Bengaluru, April 8: ఎవరో ఎక్కడో ఒక ప్రాణాంతక వైరస్ (Coronavirus) పుట్టుకకు కారణమయ్యారు, ఇంకెవరో ధనవంతులు, విదేశీ ప్రయాణాలు చేసేవారు ఆ దుష్టవైరస్ ను భారతదేశానికి తీసుకువచ్చారు. కానీ దాని ఫలితం మాత్రం నేడు అందరూ అనుభవిస్తున్నారు. అమాయకులు లాఠీ దెబ్బలు తింటున్నారు, పేదవారు కనీసం తినడానికి తిండి దొరకక ఆకలితోనే చచ్చిపోతున్నారు (Hunger Deaths) . లాక్ డౌన్ (Nationwide Lockdown) కారణంగా దేశంలోని నిరుపేదలు, రోజువారీ కూలీల బ్రతుకులు ఎంత దుర్భరంగా మారాయో అని చెప్పడానికి ఇదొక ఉదాహారణ.
కర్ణాటకకు చెందిన 29 ఏళ్ల గంగమ్మ అనే మహిళ పొట్టచేత పట్టుకొని తన స్వస్థలం రాయచూరు జిల్లా నుంచి బెంగళూరు నగరానికి వలస వెళ్లి అక్కడ భవన నిర్మాణ కార్మికురాలిగా పనిలో చేరింది. అయితే దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఆమె తన ఉపాధిని కోల్పోయింది. బెంగళూరు లాంటి మహానగరంలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా బ్రతుకు వెళ్లదీయడం ఆమెకు భారంగా మారింది. దీంతో మార్చి 30న సొంతూరుకు పయనమైంది, బెంగళూరు నుంచి తూముకూరు వరకు ట్రాక్టర్లో ప్రయాణించింది. అక్కడ పోలీసులు ట్రాక్టర్ ను నిలిపివేయడంతో గంగమ్మ అక్కడ్నించే కాలినడకనే తన ప్రయాణాన్ని కొనసాగించింది.
తినడానికి తిండి లేదు, సరైన నిద్ర లేదు. మార్గమధ్యంలో కనీసం మంచి నీళ్లు అందించే వారు కూడా కరువయ్యారు. అలా మూడు రోజుల పాటు 230 కిలోమీటర్ల దూరం నడిచిన బాధితురాలు తీవ్రంగా నీరసించి మార్గమధ్యలోనే కుప్పకూలిపోయింది. ఏప్రిల్ 2న ఆమెను సమీపంలోని బళ్లారి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. భారతదేశంలో 5,194కు పెరిగిన కోవిడ్-19 బాధితులు
ఆకలి, నీరసంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండటం చేత ఆమె ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు నివేదించారు. చనిపోయిన బాధితురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త కూడా కూలీ పనే చేస్తాడు.
కాగా, వార్త కర్ణాటక సీఎం యడ్యూరప్ప వరకు చేరింది. దయనీయ స్థితిలో మహిళ మృతి చెందటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసిన సీఎం, కార్మికులు ఎవరూ ఎక్కడికి వెళ్లరాదని సూచించారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వమే తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసి రూ. 2000 అందజేస్తున్నామని తెలిపారు. ఎవరూ కూడా ఆకలితో ఉండకుండా 'హంగర్ హైల్ప్ లైన్ - 155214' ప్రారంభించామని యడ్యూరప్ప వెల్లడించారు.
అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి ఆర్థిక పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.