Aadhaar SIM Card Link Scam: ఆధార్ తో సిమ్ కార్డు లింక్ చేస్తామంటూ భారీ మోసం, రూ. 80 లక్షలు మోసపోయిన మహిళ
చండీఘఢ్ సెక్టార్ 11కు చెందిన మహిళకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిని అంటూ ఓ నెంబర్ నుంచి నిందితుడు కాల్ చేశాడు. ఆమె ఆధార్ కార్డుపై జారీ అయిన సిమ్ కార్డును (SIM Card) చట్టవిరుద్ధంగా మనీల్యాండరింగ్ కార్యకలాపాల్లో వాడుతున్నారని బెదిరించాడు
Chandigarh, July 10: దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు (Cyber Crimes) విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా చండీఘఢ్‌కు చెందిన ఓ మహిళ నుంచి ఆధార్-సిమ్ కార్డు లింక్ స్కామ్‌లో (Aadhaar Sim Card Link Scam) సైబర్ నేరగాళ్లు రూ. 80 లక్షలు దోచేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నమ్మబలికిన నిందితులు మహిళను మోసగించారు. చండీఘఢ్ సెక్టార్ 11కు చెందిన మహిళకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిని అంటూ ఓ నెంబర్ నుంచి నిందితుడు కాల్ చేశాడు. ఆమె ఆధార్ కార్డుపై జారీ అయిన సిమ్ కార్డును (SIM Card) చట్టవిరుద్ధంగా మనీల్యాండరింగ్ కార్యకలాపాల్లో వాడుతున్నారని బెదిరించాడు. బాధితురాలిని మరింత భయపెట్టేందుకు ఆమెపై 24 మనీ ల్యాండరింగ్ ఫిర్యాదులు నమోదయ్యాయని బెదరగొట్టాడు.
బాధితురాలిని అరెస్ట్ చేస్తారని కాలర్ హెచ్చరించాడు. న్యాయపరమైన చిక్కుల్లో పడతాననే భయంతో బాధితురాలు నిందితుడు సూచనలకు అనుగుణంగా నడుచుకోవడంతో భారీ మొత్తంలో నష్టపోయారు. కేసు నుంచి తప్పించాలంటే తాను చెప్పిన బ్యాంక్ ఖాతాలో రూ. 80 లక్షలు డిపాజిట్ చేయాలని తర్వాత వాటిని రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు. నిందితుడు చెప్పినట్టు బాధితురాలు భారీ మొత్తాన్ని అతడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఆపై మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.