IPL Auction 2025 Live

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆమోదం పొందితే 82 నుంచి 181కి పెరగనున్న మహిళా ఎంపీల సీట్ల సంఖ్య

కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ తొలి సమావేశంలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు.

PM Modi in Special Parliament Session (Photo-ANI)

ముంబై, సెప్టెంబర్ 19: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో కొత్త మహిళా రిజర్వేషన్ బిల్లును ఈరోజు సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టింది. కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ తొలి సమావేశంలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియం అని పేరు పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళల సీట్లను పెంచాలని ప్రతిపాదిస్తుంది. 2029 నాట‌కి మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు అములోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.ఈ బిల్లుతో రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో రిజర్వ్డ్ సీట్ల‌ను కేటాయించ‌నున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మేఘ్వాల్ మాట్లాడుతూ, నారీ శక్తి వందన్ అధినియం ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో మహిళలకు సీట్ల సంఖ్య 181కి పెరుగుతుందని అన్నారు. బిల్లును సభ్యుల ముందు ఉంచిన కొద్దిసేపటకే దిగువ సభ రేపటికి వాయిదా పడింది (adjourned till tomorrow). రేపటి నుంచి మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇక ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ 2029 వరకు అమలులోకి రాకపోవచ్చు, కారణం ఏంటో తెలుసా..

సోమవారమే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ బిల్లుకు.. విపక్షాలు కూడా మద్దతు తెలుపుతుండటంతో ఉభయసభల్లో బిల్లు చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.బిల్లు ద్వారా లోక్‌స‌భ‌, అసెంబ్లీల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం కోటా ఉంటుంది. రాజ్యస‌భ లేదా శాస‌న‌మండ‌లికి ఈ బిల్లు వ‌ర్తించదు. ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు మూడ‌వ వంత సీట్లను రిజ‌ర్వ్ చేశారు.

ఒక సీటు కోసం ఇద్దరు మ‌హిళా ఎంపీలు పోటీప‌డ‌కూడ‌దు. ఓబీసీ క్యాట‌గిరీలో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ లేదు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత రిజర్వేష‌న్లు కేటాయించ‌నున్నారు. లోక్‌స‌భ‌, అసెంబ్లీల్లో మ‌హిళా రిజ‌ర్వ్డ్ సీట్లకు రొటేష‌న్ ప‌ద్ధతి క‌ల్పించారు. విధాన రూప‌క‌ల్పన‌లో మ‌హిళ‌ల పాత్రను పెంచేందుకే ఈ బిల్లును తీసుకువ‌చ్చారు. గ‌త 27 ఏళ్ల నుంచి మ‌హిళా బిల్లు పెండింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

జ‌నాభా లెక్క‌ల అనంత‌రం, అంటే 2027లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ఉంటుంది. 2021 జ‌ర‌గాల్సిన జ‌నాభా లెక్క‌ల‌ను కోవిడ్ వ‌ల్ల పెండింగ్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. చ‌ట్టంగా మారిన త‌ర్వాత ఆ బిల్లు సుమారు 15 ఏళ్ల పాటు అమ‌లులో ఉంటుంది. ఆ ట‌ర్మ్‌ను కావాలంటే కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌తిసారి డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగిన త‌ర్వాత‌.. మ‌హిళ‌లకు కేటాయించిన సీట్ల‌ను రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో మార్చుతారు. ఓబీసీకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలు మ‌హిళా బిల్లును అందుకే వ్య‌తిరేకిస్తున్నాయి.

2010లో మ‌న్మోహ‌న్ స‌ర్కార్ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ముసాయిదాను తీసుకువ‌చ్చింది. కొత్త బిల్లు దాదాపు ఆ బిల్లుకు స‌మానంగా ఉంది. ఆంగ్లో ఇండియ‌న్ క‌మ్యూనిటీల‌కు కోటా క‌ల్పించే స‌వ‌ర‌ణ‌ల‌ను కొత్త బిల్లులో ఎత్తివేశారు. ఆర్టిక‌ల్ 239ఏ, 330ఏ, 332ఏ ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్డ్ సీట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 14 శాతం మ‌హిళ‌లు మాత్ర‌మే పార్ల‌మెంట్‌, అసెంబ్లీల్లో ఉన్నారు. ప్రపంచం స‌గ‌టుతో పోలిస్తే ఇది చాలా త‌క్కువ‌. ప్రభుత్వం బిల్లును ఆమోదించడానికి సిద్ధమవుతున్న తరుణంలో నారీ శక్తి వందన్ అధినియం బిల్లు గురించి మనకు తెలిసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మీరు తెలుసుకోవలసినది:

మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ అధినియం అని కూడా పిలుస్తారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించాలని కోరింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు, లేదా నారీ శక్తి వందన్ అధినియం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

నారీ శక్తి వందన్ అధినియం ఇంకా లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందలేదు; బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎంపీలందరినీ ప్రధాని మోదీ కోరారు.

నారీ శక్తి వందన్ అధినీయం ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో మహిళలకు సీట్ల సంఖ్య 181కి పెరుగుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.

"నారీ శక్తి వందన్ అధినియం" గురించి మాట్లాడుతూ, ఈ బిల్లు ఎక్కువ మంది మహిళలు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో సభ్యులుగా ఉండేలా చూస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

బిల్లు ఉభయ సభల్లో సాఫీగా ఆమోదం పొందుతుందని భావిస్తున్నప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే బిల్లు అమల్లోకి వస్తుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా నారీ శక్తి వందన్ అధినియం 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత 15 ఏళ్ల పాటు చట్టం అమల్లో ఉంటుంది.

నారీ శక్తి వందన్ అధినియం ఆమోదం పొందితే లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య ప్రస్తుతం 82 నుంచి 181కి పెరుగుతుంది. నివేదికల ప్రకారం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే చర్చ రేపు, సెప్టెంబర్ 20న లోక్‌సభలో జరగనుండగా, సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగనుంది.