Wrestlers’ Sexual Harassment Case: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు, 18న విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూలై 7: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan Sharan Singh) ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌ను విచారించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం కోర్టుకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది.
కాగా రెజర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. జూన్ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై రెండు కేసులు నమోదు చేశారు. జూన్ 15న ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను అందులో పేర్కొన్నారు. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు.