Christmas in India: మన దేశంలో ఈ రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకులు ఘనంగా నిర్వహిస్తారు, అంబరాన్ని తాకే క్రిస్మస్ సంబరాలు చూడటం కోసం ఈ రాష్ట్రాలకు వెళ్లండి.

ఈ చెట్టును రంగు కాగితాలు,నక్షత్రాలు, గంటలు, గాజు గోళాలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.

Merry Christmas | (Photo Credits: Pixabay)

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు క్రైస్తవుల ఇళ్లన్నీ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు అవుతుంటాయి మన దేశంలోనూ స్థానిక సంప్రదాయాలను రంగరించి సంబరం చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. క్రీస్తు జననానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతాయి. అంతా ఒక చోటకు చేరి సామూహిక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ప్రపంచమంతా జరిగే ఈ వేడుకలు వివిధ దేశాల్లో అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటడడం విశేషం. క్రిస్మస్ వేడుకల్లో ప్రతిఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగు కాగితాలు,నక్షత్రాలు, గంటలు, గాజు గోళాలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిపై వెదురు బద్దలతో రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తారు. గోవా, కేరళ, హైదరాబాద్‌, పుదుచ్చేరి, ముంబై, కోల్‌కతా, బెంగుళూరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. కొంతమంది హిందువులు కూడా వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకల్లో విద్యుత్ దీపాల అలంకరణ, సంగీతం, కరోల్ గీతాలాపన, కొవ్వుత్తులు ప్రధానంగా కనిపిస్తాయి. అంతా సమూహాలుగా ఏర్పడి ప్రత్యేక ప్రార్థనలు, విందుల్లో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఈ పండగ అంటే చాలా మందికి ముందుగా కానుకలు ఇస్తూ ఉంటారు. ఇది అతి ప్రాచీన సంప్రదాయం. క్రీస్తు పశువుల పాకలో శిశువుగా ఉన్నప్పుడు ఆయనకు కొందరు రాజులు, పెద్దలు బహుమతులు ఇచ్చినందుకు గుర్తు.

గోవా : గోవాలో క్రైస్తవులు ఇళ్లను అరటి చెట్లతో అలంకరించుకుంటారు. సామూహిక భోజనాలు చేస్తుంటారు. బీచ్‌లు కూడా ఎక్కువగా ఉండటంతో అంతా బీచ్ ఒడ్డున చేరి వేడుకలు సంతోషంగా గడుపుకుంటారు. శాంతాక్లాజ్ వచ్చి చిన్నారులకు బహుమతులు ఇవ్వడం ప్రధానంగా ఉంటుంది.

కేరళ : దేవభూమిగా పిలువబడే ఈ రాష్ట్రంలో క్రిస్మస్ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఇంటిలో క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ సంగీతం ఏర్పాటు చేస్తారు. పండుగకు వచ్చిన అతిథులకు ఇంట్లో తయారుచేసిన వైన్‌ను అందిస్తారు. కర్రపెండలంతో బిర్యానీ చేసి వడ్డిస్తారు.

పుదుచ్చేరి : ఇక్కడ బాసిలికాకు చెందిన చర్చి ఎంతో ముఖ్యమైనది ఆ రోజున క్రైస్తవులంతా కలిసి సామూహిక ప్రార్థనలు చేస్తారు. దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.అరోవిల్లి, ప్రొమెనాడే బీచ్‌లలో ఈవెంట్లు జరుగుతాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో : ఇక్కడ షిల్లాంగ్ క్రైస్తవులకు అతి ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి కెథడ్రల్ చర్చి చాలా ప్రసిద్ధిచెందింది. వందేళ్లనాటి నుంచి ఓ మహావృక్షం ఈ చర్చిలో ఉంది. ఈ చెట్టు కింద సమావేశమైన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని పాస్టర్ వివరిస్తారు. మత బోధనలు చేసి ప్రేమ,శాంతి వంటి అంశాలను బోధిస్తారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ వింధు భోజనాలు చేస్తారు.