Alka Lamba: రెబెల్ ఎమ్మెల్యే అల్కా లంబాపై అనర్హత వేటు, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేగా అనర్హురాలిగా ప్రకటించిన ఢిల్లీ స్పీకర్

ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హతకు గురైన ఢిల్లీ ఎమ్మెల్యేల సంఖ్య అల్కా లంబాతో కలిపి 5కు చేరింది....

Alka Lamba - Disqualified MLA, New Delhi | File Photo

New Delhi, September 19:  ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రెబెల్ ఎమ్మెల్యే అల్కా లంబా (Alka Lamba) పై ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అనర్హత వేటు వేశారు. ఆప్ ముఖ్య ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ప్రతిపాదించిన అనర్హత పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని చాందిని చౌక్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అల్కా లంబా గత కొంతకాలంగా సొంత పార్టీపైనే తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 06న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

పార్టీని వీడుతూ ఆమ్ ఆద్మీ పార్టీపై అల్కా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (పేదల పార్టీ) కాదని, పూర్తిగా ఖాస్ ఆద్మీ పార్టీ (ధనవంతుల పార్టీ) అని, బంధుప్రీతి పార్టీ అని విమర్శించారు. ఇకపై కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తానని లేదంటే స్వతంత్రంగానే పోటీ చేస్తానని పేర్కొన్న ఆమె, తాను పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.  అయితే ఆప్ (AAP) మాత్రం ఆమె ఎమ్మెల్యే పదవినే ఊడబీకి గట్టి షాక్ ఇచ్చింది. అల్కా లంబా శాసన సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన ఢిల్లీ స్పీకర్,  అక్టోబర్ 06, 2019 నుంచి ఆమె అనర్హత అమలులోకి వస్తుందని ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. స్పీకర్ నిర్ణయంతో చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానంలో ఖాళీ ఏర్పడటమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో అల్కా లంబా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది.

అయితే ఇప్పుడు అల్కా లంబా మాత్రం తాను ఆమ్ ఆద్మీ పార్టీకి లిఖితపూర్వకంగా ఎలాంటి రాజీనామా పత్రాన్ని దాఖలు చేయలేదని కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించానని చెపుతుంది. తాను ఇప్పటికీ ఆమ్ పార్టీ సభ్యురాలినేనంటూ పేర్కొంది.

వివాదం ఎలా మొదలైంది?

గతంలో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన అల్కా లంబా 2014వ సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే కొన్ని నెలల క్రితం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి ఉన్న భారత రత్న పురస్కారాన్ని రద్దు చేయాలని  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన దగ్గర్నించీ అల్కా లంబా వివాదం మొదలైంది. ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె అప్పట్నించీ పార్టీపై తిరుగుబాటు చేస్తూ వస్తుంది. గత ఎంపీ ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. గత రెండు నెలలుగా పార్టీని వీడుతానంటూ ప్రకటించిన ఆమె, సెప్టెంబర్ 6న సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు.

కాగా,  ఇప్పటివరకు  పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హతకు గురైన ఢిల్లీ ఎమ్మెల్యేల సంఖ్య అల్కా లంబాతో కలిపి 5కు చేరింది.