Saina Nehwal: బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం, దిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు బ్రాండ్ విలువ కలిగిన క్రీడాకారులలో సైనా ఒకరు. ఒలంపిక్స్ లో కాంస్య పతకంతో పాటు 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెం1 ర్యాంకు....
New Delhi, January 29: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) బుధవారం భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ (Arun Singh) ఆమెకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ రశీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. "నేను దేశం కోసం పతకాలు సాధించాను, దేశం కోసం కష్టపడతాను. అలాగే కష్టపడి పనిచేసే వాళ్లంటే నాకెంతో ఇష్టం. మన దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎంతో కష్టపడుతున్నారు. మోదీ ద్వారా నేను ఎంతో స్పూర్థి పొందాను. ఆయనతో కలిసి దేశం కోసం ఏదైనా చేయాలనుంది". అని చెప్తూ, అందుకే పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. దిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం- హోమంత్రి అమిత్ షా!
హర్యానాకు చెందిన 29 ఏళ్ల సైనా నైహ్వాల్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ (Hyderabad) లో స్థిరపడ్డారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు బ్రాండ్ విలువ కలిగిన క్రీడాకారులలో సైనా ఒకరు. ఒలంపిక్స్‌లో కాంస్య పతకంతో పాటు 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెం1 ర్యాంకు కూడా సాధించారు. ప్రస్తుతం 9వ ర్యాంకులో కొనసాగుతున్నారు. 2020 టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. 2018 సహచర క్రీడాకారుడు పారుపెల్లి కశ్యప్‌ను పెళ్లి చేసుకున్న సైనా, హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకొని అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు.
సైనా ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా ఆమెను దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారానికి బీజేపీ వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 08న దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దించేసేందుకు బీజేపీ అక్కడ సర్వ శక్తులు ఒడ్డుతోంది.