Maharashtra New CM Uddhav Thackeray: 20 ఏళ్ల కరువు తర్వాత మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ప్రభుత్వం, 50 వేల మంది మద్ధతుదారుల, అతిథుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్ ఠాక్రే, ఆయనతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం
శివసేన పార్టీకి చెందిన నేత ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి.....
Mumbai, November 28: మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా శివసేన (Shiv Sena) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రమాణం చేశారు. గురువారం సాయంత్రం 6:40 నిమిషాలకు, ముంబైలోని దాదార్ ప్రాంతంలో గల చారిత్రాత్మక శివాజీ పార్కులో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్ధవ్ చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు శివసేన, కాంగ్రెస్ మరియు ఎన్సీపీ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఆరు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్‌సిపి నుంచి జయంత్ పాటిల్, చాగన్ భుజ్‌బాల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరత్, నితిన్ రౌత్‌తో పాటు శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్, ఏక్ నాథ్ షిండే ఉన్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం బీజేపీతో జతకట్టి డిప్యూటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ కి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్ మరియు మల్లికార్జున్ ఖార్గేలతో పాటు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఉన్నారు తదితర అగ్రనేతలు హాజరయ్యారు.
అంతేకాకుండా మహారాష్ట్ర తాజా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మరియు అతని ఛత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ సహా ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా హాజరవడం విశేషం.
వీరితో పాటు ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడటానికి పెద్ద ఎత్తున 'మహా వికాస్ అఘాడీ' చెందిన కార్యకర్తలు, మద్ధతు దారులు దాదాపు 50 వేల మంది సభా మైదానానికి వీచ్చేశారు.
దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ నేటికి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కొలువుదీరింది.