Citizenship Amendment Bill 2019: పౌరసత్వ (సవరణ) బిల్లు-2019కు రాజ్యసభ ఆమోదం, ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు 125 ఎంపీలు అనుకూలం, 105 సభ్యులు వ్యతిరేకంగా ఓటు, ఉభయ సభల్లో నెగ్గిన బిల్లు
రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఈ బిల్లు చట్టరూపం దాల్చబడి నిర్ధేషించిన...
New Delhi, December 12: పౌరసత్వ (సవరణ) బిల్లు-2019 (Citizenship (Amendment) Bill 2019) కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 125: 105 తేడాతో పెద్దల సభలో ఈ బిల్లు నెగ్గింది. మెజారిటీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో పౌరసత్వ బిల్లు రాజ్యసభ (Rajya Sabha) ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. అంతకుముందు లోకసభలో పాస్ అయిన ఈ బిల్లు, ఇటు రాజ్యసభలోనూ గట్టెక్కడంతో ఉభయ సభల ఆమోదం లభించినట్లయింది. తద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి ముస్లిమేతర వలసదారుల (non-Muslim Refugees) కు భారత పౌరసత్వం ఇచ్చే శాసన చట్టానికి పార్లమెంట్ ఆమోదం లభించింది.
రాజ్యసభలో CAB (Citizenship Amendment Bill) కు అనుకూలంగా 125 ఓట్లు లభించగా, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 105 ఓట్లు పోలయ్యాయి. ఈ బిల్లులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 48 సవరణలు కూడా మూజువాణి ఓటుతో వీగిపోయాయి. బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ సర్కారుకు దాని మిత్రపక్షాలైన జెడి(యు) మరియు ఎస్ఎడి నుంచే కాకుండా, ఎఐఎడిఎంకె, బిజెడి, టిడిపి మరియు వైయస్ఆర్-కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా మద్ధతు లభించింది.
ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్ధతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిందుత్వ భావజాలం గల శివ్ సేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఈ ఓటింగ్ ను బాయ్ కాట్ చేశాయి. మరికొంత మంది సభ్యులు కూడా ఇతరత్రా వ్యక్తిగత కారణాలతో ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుకు గానూ, టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లింది. ఇక టీడీపీ- వైసీపీలు కూడా వారివారి అవసరాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి.
Here's the update:
రాజ్యసభలో CAB పై బుధవారం ఆరున్నర గంటలుగా చర్చ జరిగింది. హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడుతూ, ఈ చట్టం మూడు ఇస్లామిక్ దేశాలలో మతపరంగా హింసించబడిన మైనారిటీ వర్గాలకు భారత పౌరసత్వం కల్పిస్తుందే తప్ప, ఎవరీ పౌరసత్వాన్ని తొలగించదు అని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ముస్లింలకు వ్యతిరేకం అన్న ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా ఖండించారు.
ముస్లింలు ఈ బిల్లు పట్ల ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని ఆయన పునరుద్ఘాటించారు.
కాగా, ప్రతిపక్ష సభ్యులు పౌరసత్వ సవరణ బిల్లు "రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారని కాంగ్రెస్ నేత పి. చిదంబరం అన్నారు. ఈ బిల్లును న్యాయవ్యవస్థ అంగీకరించబోదని ఆయన తేల్చిచెప్పారు.
ఏది ఏమైనా, ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు పంపనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఈ బిల్లు చట్టరూపం దాల్చబడి నిర్ధేషించిన సమయానికి అమలులోకి వస్తుంది.