Citizenship Amendment Bill 2019: పౌరసత్య సవరణ బిల్లు లోక్‌సభలో అర్ధరాత్రి ఆమోదం, అసలు పరీక్ష రాజ్యసభలో, తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన బీజేపీ, ఈశాన్య రాష్ట్రాల్లో తారాస్థాయికి నిరసనలు 
Union Home Minister Amit Shah in Lok Sabha, Protest erupts in Assam over CAB 2019| Photo: ANI

New Delhi, December 10: పౌరసత్వ సవరణ బిల్లు 2019  (Citizenship Amendment Bill 2019) లోక్‌సభ (Lok Sabha) లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమోదించబడింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311 మంది సభ్యులు ఓటు వేయగా, 80 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. బిల్లుకు సంబంధించి ఒక్కొక్క అంశం వారీగా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్లులో సవరణలు కోరుతూ ప్రతిపక్షాలు చేసిన ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రకటించారు.

అంతకుముందు, మత ప్రాతిపాదికన పౌరసత్వం కల్పిస్తున్న ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టే అర్హత లేదంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదురీ, టీఎంసీ ఎంపీ సౌగతారాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ముస్లింలకు నీడలేకుండా చేయాలనుకుంటున్న హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుతో హిట్లర్ లా నిలిచిపోతారంటూ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడుతూ బిల్లు ప్రతులను చింపివేశారు. వాదప్రతివాదనల మధ్య హోంమంత్రి అమిత్ షా (Amit Shah) , సభ్యుల విమర్శలు, అభ్యంతరాలన్నింటికీ అంశాలవారీగా సుదీర్ఘమైన వివరణలు ఇస్తూ పోయారు. అసలు దేశాన్ని మత పరంగా విభజించిందే కాంగ్రెస్ పార్టీ అని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ విభజనను అనుమతించకపోయి ఉంటే ఈరోజు ఈ బిల్లు అవసరం ఉండేది కాదు అని తెలిపారు. 1955 పౌరసత్వ చట్టానికి ఈ సవరణ ద్వారా అక్రమ చొరబాటుదారుడు మరియు శరణార్థి మధ్య తేడాను చూపుతుందని ఆయన అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని అమిత్ షా పేర్కొన్నారు.

ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం అన్న వాదనను అమిత్ షా తోసిపుచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు అఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన పీడనకు గురై భారత్ లోకి వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లు రూపొందించామని అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, ఉపప్రధానిగా సేవలందించిన అడ్వాణీ కూడా పాకిస్థాన్ నుంచి వలస వచ్చినవారేనని అమిత్ షా తెలిపారు. ఈ బిల్లు ఏ ఒక్కరి హక్కులను హరించదు, ఏ ఒక్కరిపై వివక్ష చూపదని ఉద్ఘాటించారు.

కాగా, ఈ బిల్లుకు ఎన్డీయే పక్షాలతో పాటు, ఆ కూటమిలో లేని టీడీపీ, వైసీపీ, శివసేన, అకాలీదళ్, బిజూ జనతాదళ్ లాంటి పార్టీలు మద్ధతు తెలిపాయి. అయితే వైసీపీ మాత్రం కొన్ని శరతులు పెట్టింది. ఈ బిల్లులో ఉన్న కొన్ని అభ్యంతరాలపై తాము దృష్టిపెడతామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక ఈ బిల్లును కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, బీజేడీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఐయూఎంఎల్, మరియు లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి.

పౌరసత్వ సవరణ బిల్లు 2019 బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆనందం వ్యక్తం చేశారు. విస్తృతమైన చర్చల తరువాత పౌరసత్వం (సవరణ) బిల్లు, 2019ను లోక్‌సభ ఆమోదించినందుకు సంతోషం. బిల్లుకు మద్దతు ఇచ్చిన వివిధ పార్టీలకు, సభ్యులకు నా కృతజ్ఞతలు. ఈ బిల్లు భారతదేశం యొక్క శతాబ్దాల సామాజిక స్పూర్థి మరియు మానవతా విలువలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉంది అంటూ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షాను మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

Here's the tweet:

ఇక లోక్‌సభలో గట్టెక్కిన ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అప్పుడే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్లవుతుంది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యా బలం తక్కువ, ఈ నేపథ్యంలో అందరూ సభకు హాజరై, బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా తమ పార్టీ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది.

ఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రాలలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (NESO) మరియు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈశాన్యంలో చాలా చోట్ల బంద్ కు పిలుపునిచ్చారు. అస్సాంలోని గువహటిలో షాపులు, పాఠశాలలు, కళాశాలలు ప్రధానంగా మూసివేయబడ్డాయి. చాలా చోట్ల నిరసనకారులు టైర్లు తగలబెట్టి రోడ్లు, జాతీయ రహదారులను అడ్డుకున్నారు. దీని సాధారణ జనజీవితం స్థంభించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మరియు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అస్సాం రాష్ట్రవ్యాప్తంగా అదనపు భద్రతా దళాలను మోహరింపజేశారు.