GHMC Election Results 2020: గ్రేటర్‌లో మేయర్ పీఠం దక్కేది ఎవరికి? ప్రారంభమైన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్, బ్యాలెట్ ఓటింగ్ కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తెరాసకు 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది, బీజేపీకి 20-25 వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి...

GHMC Polls 2020 -Counting of votes begins. (Photo Credits: ANI)

Hyderabad, December 4: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈనెల 1న మంగళవారం రోజున 30 సర్కిల్ల పరిధులలోని 150 డివిజన్లకు ఎన్నికలు జరగగా, మలక్ పేటడివిజన్లో గురువారం రీపోలింగ్ జరిగింది. వీటన్నింటికీ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు, వీటి తర్వాత రెగ్యులర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరిగినందున ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

పోలింగ్ కేంద్రం పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించనున్నారు. అనుమానిత ఓట్లపై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ కోరుకుంటే, ఫలితాలు వెల్లడికాకముందే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని ఈసీ పేర్కొంది.  లెక్కింపు ప్రక్రియలో కూడా సిబ్బంది అన్ని రకాల కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

గ్రేటర్ పరిధిలో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్యేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం తన స్థానాలు తను గెల్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతసారి కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగినా, మొత్తం కలిపి 50 శాతం కూడా ఓటింగ్ నమోదు కాలేదు. అయితే తక్కువ ఓటింగ్ కూడా తమకే లాభిస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకోగా, ఈసారి కూడా 100 స్థానాలు పక్కా అంటూ తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తెరాసకు 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది, బీజేపీకి 20-25 వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి. మరి ఓటరు తీర్పు ఎలా ఉందో, ఈసారి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది.  సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.