AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా? రాష్ట్రపతి పాలన విధించాలంటున్న తెలుగు దేశం నాయకులు, ఈసీ లేఖ పట్ల ప్రభుత్వం సీరియస్

ఏపీలో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో....

AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravathi, March 19:  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda RameshKumar) తన ప్రాణాలకు, తన కుటుంబానికి ముప్పు ఉందని పేర్కొంటూ భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ (CM YS Jagan) ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వారిది ఫ్యాక్షన్ చరిత్ర, కక్ష సాధింపు ధోరణి కలవారు కేంద్రమే జోక్యం చేసుకోవాలంటూ తీవ్రమైన పదజాలంతో ఆయన లేఖ రాశారని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  ఈసీ లేఖ ఆధారంగా  టీడీపీ నాయకులు జగన్ ప్రభుత్వంపై  తీవ్రంగా స్పందిస్తున్నారు, మీడియా మరియు సోషల్ మీడియాలలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు లాంటి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఊగిపోయారు.

అయితే ఈసీ రమేశ్ కుమార్ మాత్రం ఈ లేఖను ధృవీకరించలేదు. తనకు ఈ లేఖకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి.  అయితే తన పేరుతో విడుదలైన లేఖపై ఇంతగా దుమారం చెలరేగుతున్నప్పుడు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ బయటకు వచ్చి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.  ప్రస్తుతం ఈసీ రమేష్ 'అండర్ గ్రౌండ్' లో ఉన్నారంటూ 'ఎకానమిక్స్ టైమ్స్' పత్రిక నివేదించింది.

మరోవైపు ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని రాజకీయ కుట్రగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తన పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ వెళ్లినప్పటికీ, నిమ్మగడ్డ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. దీని వెనక ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. తనకు భద్రత ఉంటే ముందుగా పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల కమీషనర్ ముసుగులో చంద్రబాబుకు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈసీ వ్యవహారంపై కేంద్రాన్ని సంప్రదించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

 

కరోనావైరస్ వ్యాప్తి ఉందని ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేశారు.  ప్రభుత్వాన్ని ఏ మాత్రం సంప్రదించకుండా ఈసీ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది, ఎన్నికల నిర్వహణ నిర్ణయాధికారం ఈసీదే అని స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని కూడా సుప్రీం తప్పుపట్టింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయాల్సిందిగా సూచించింది.  ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఈసీ పరిధిలోనిదే- సుప్రీంకోర్ట్

ఈ కేసులో సుప్రీం ధర్మాసనం, ఇరువర్గాల వాదనలకు సానుకూలంగానే స్పందించింది. అయితే తెలుగుదేశం- చంద్రబాబు మీడియా సుప్రీం తీర్పు సీఎం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని విస్తృత ప్రచారం చేసుకోగా, ఇటు జగన్ మీడియా కూడా టీడీపీపై దుమ్మెత్తిపోసింది.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి- రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో ఈసీ మరియు ప్రభుత్వం నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. నిజానికి ఒక రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తన రాష్ట్ర ప్రభుత్వంతో ముప్పు ఉందని చెప్పడం అత్యంత తీవ్రమైన ఫిర్యాదు. ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ, అది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పవిత్రమైన సంస్థ, అలాంటి సంస్థకు నేతృత్వం వహించే వ్యక్తే ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం అంటే ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.

ఇక రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు, అరాచకాలు జరిగిపోతున్నాయి, ఎవరైనా కాపాడండి అని గొంతుచించుకుంటున్న ఏపీ ప్రతిపక్ష నేతల విమర్శలు, చర్యలు సగటు పౌరుడికి వెగటు పుట్టిస్తున్నాయి. అధికారం కోల్పోవడంతో నేడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ నేతలు, అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లో ఉండదు అనే ఇంగితాన్ని వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించి ఉంటే రాష్ట్రంలో ఈరోజు ఇలాంటి రాజకీయ విషపు పరిస్థితులు ఉండేవి కావు.

వ్యవస్థలు నిర్వీర్యం చేసే నేతలు, మనమేం చెప్పినా చెల్లుతుందనే భావనలో ఉండే నాయకులు ఇప్పటికీ కళ్లు తెరిచి తమ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రం ఎప్పటికీ పురోగతి సాధించదు. ఏపీలో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో చూడాలి.