IPL Auction 2025 Live

EC Defers By-polls: కరోనా ఉధృతి దృష్ట్యా ఉప ఎన్నికలను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా

మద్రాస్ హైకోర్ట్ అయితే నేరుగా తమిళనాడులో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణం అని నిందించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా

Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi, May 6: దేశంలో సెకండ్ వేవ్ కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలపై సీఈసీ వెనక్కి తగ్గింది. ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇటీవల 5 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపిలోని తిరుపతి లోక్‌సభ స్థానాలకు మరికొన్ని చోట్ల ఉపఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికలే దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని విమర్శలు ఉన్నాయి. మద్రాస్ హైకోర్ట్ అయితే నేరుగా తమిళనాడులో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణం అని నిందించింది.

ఈ క్రమంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో పరిస్థితులు మెరుగుపడి, మళ్లీ సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఎన్నికలు జరపబోమని ఈసీ స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, కేంద్ర పాలిత ప్రాంతంలోని దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలతో పాటు, కర్ణాటకలోని సింద్గీ, హరియాణలోని ఎలినాబాద్‌ మరియు కల్కా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఫతేపూర్, రాజస్థాన్‌లోని వల్లభ్ నగర్, మేఘాలయలోని రాజ్‌బాలా, మరయింగ్‌కెంగ్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను బట్టి ఎన్నికల నిర్వహణపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.