Farooq Abdullah Questioned by ED: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ స్కాం, మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు, అలాంటిదేమి లేదని తెలిపిన కుమారుడు ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘంలో జరిగిన అవకతవకల విషయంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ (Enforcement Directorate) ఆరోపిస్తోంది. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపించారు.
Srinagar, October 19: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు (Farooq Abdullah Questioned by ED) విచారిస్తున్నారు. జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘంలో జరిగిన అవకతవకల విషయంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ (Enforcement Directorate) ఆరోపిస్తోంది. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపించారు.
కాగా 43.69 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు ఫారూక్‌పై మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2015లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. జేకే క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఫారూక్ ఉన్న సమయంలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి పలుమార్లు ఈ కేసులో ఆయన వాంగ్మూలం తీసుకున్నారు.
అయితే ఇవాళ మరోసారి ఈడీ ఆ కేసులో విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే ఫారూక్‌తో పాటు ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేశారు. 2019 సెప్టెంబర్‌లో మీర్జాను మనీల్యాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. 2002 నుంచి 2011 మధ్య బీసీసీఐ సుమారు 112 కోట్ల నిధులను జేకే క్రికెట్ సంఘానికి మంజూరీ చేసింది. దాంట్లో 43 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ స్పందించారు. తమ ఇంటిపై ఈడీ ఎలాంటి దాడులు చేయలేదని ప్రకటించారు. ఈడీ సమన్లకు పార్టీ తరపున సమాధానం ఇస్తామని తెలిపారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ కశ్మీర్ వేదికగా కొత్త కూటమి ఆవిర్భవించిన నేపథ్యంలోనే కేంద్రం ఇలాంటివి చేస్తోందని ఒమర్ ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఆరు పార్టీలు కూటమిగా ఏర్పడటంతోనే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరుతూ ఫరూక్ అబ్ధుల్లా నివాసంలో జరిగిన ఆరు పార్టీల నేతల సమావేశం డిక్లరేషన్ జారీ చేసిందని చెప్పారు. ఈ భేటీలో పీడీపీ చీఫ్ మెహబూబూ ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజద్ లోన్, పీపుల్స్ మూవ్‌మెంట్ నేత జావేద్ మిర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, ఆవామి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ముజఫర్ షా పాల్గొన్నారు. మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఈ సమావేశానికి పిలుపు ఇచ్చారు.