AP Exclusive Analysis: జగన్ ప్రభుత్వం కూలిపోతుందా? పవన్ కళ్యాణ్ హెచ్చరికలు, చంద్రబాబు శాపనార్థాల వెనక ఆంతర్యమేమి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లుగా నేతల వ్యాఖ్యలు.
గత ఎన్నికల్లో టీడీపీ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీతో జతకూడి మోదీ, అమిత్ షాల ఓటమి కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసి బోల్తాపడిన చంద్రబాబును బీజేపీ మరిచిపోతుందా? ఇటు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో బీజేపికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారే...
Amaravathi, September 03: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Govt) ఏర్పడి కనీసం 4 నెలలు కూడా అవ్వలేదు. కానీ, ఈ మూడు నెలల కాలంలోనే దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోలేనన్ని విమర్శలను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా టీడీపీ+ జనసేన పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మరియు ఇతర నాయకులు ఏపిలో సీఎం జగన్ విధ్వంసక పాలన, అరాచక పాలన కొనసాగిస్తున్నారని ప్రతిరోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ రాజధాని వివాదంపై మాట్లాడుతూ "ఇప్పుడు అధికారంలో జగన్ ఉన్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అధికారం ఎప్పుడు ఒకరి చేతుల్లోనే ఉండదు. రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం". అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోదీ, అమిత్ షా లతో తనకు మంచి అనుబంధం ఉందని, జగన్ తమను లెక్కచేయకుండా మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను వెళ్లి కలుస్తాను, జగన్ వ్యవహారాన్ని అక్కడ తేలుస్తాను అన్నట్లుగా హెచ్చరించారు. ఒకవైపు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలను కురిపించారు. 70 ఏళ్లుగా ఎవ్వరు పరిష్కరించలేని కశ్మీర్ సమస్యను, ఎంతో సులువుగా పరిష్కరించిన గొప్ప నేత మోదీ అని పవన్ అన్నారు. మోదీ తలుచుకోవాలే గానీ, ఏపిలో సమస్య ఎంత చిన్నది అన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు చేశారు.
( కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లుగా, ప్రధాని మోదీ ఏపిలో కూడా ప్రభుత్వాన్ని రద్దు చేయగలడు అనే కోణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ప్రసంగంలో చాలావరకు జగన్ లాంటి పాలన ఎంతో కాలం ఉండదు, కాలం సమాధానం చెపుతుంది అనే మాటలు ఇదే ఆంతర్యాన్ని సూచిస్తుంది).
ఈ మధ్య కాలంలో బీజేపి దేశంలో తాను అధికారంలో లేని రాష్ట్రాలలో కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. కర్ణాటక, గోవాలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను కూలదోసి బీజేపి అధికారంలోకి వచ్చింది. సిక్కిం రాష్ట్రంలో కూడా గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవని బీజేపి మిగతా పార్టీలోని ఎమ్మెల్యేలను లాగేసుకొని ఏకంగా అక్కడి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
బహూశా, ఇలాంటి చర్యలే టీడీపీ+ జనసేన పార్టీలకు ఏపిలో ఇంకా ఆశలు రేకెత్తేలా చేస్తుండవచ్చు. అందుకే పవన్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీని ప్రశంసిచడం, జనసేన నాయకులు సైతం బీజేపీ స్థాయిలో 'దేశభక్తి' భావజాలపు ప్రకటనలిస్తున్నారు.
మరి ఏపీలో ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలకనుగుణంగా మోదీ సర్కార్, ఆంధ్ర ప్రదేశ్ పై తన పెత్తనం చూపిస్తుందా?
మంచో, చెడో ఏపీ ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఘనమైన మెజార్టీతో సీఎంగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారు, టీడీపీకి 23, జనసేనకు 1 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇద్దామని మాత్రమే అంత మెజారిటీ ఇవ్వలేదు. నవ్యాంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు పాలన పట్ల వ్యతిరేకత, జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి, అక్కడిపాలనలో వ్యత్యాసం అన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుకు ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు.
ఈవీఎంలతో గెలుపు అనేవి పరిపక్వత లేని, కింది స్థాయి ఆరోపణలు. దాని ప్రకారం ప్రధాని మోదీ కూడా ఈవీఎంలతోనే గెలిచినట్లు, 40 సంవత్సరాల
రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి , పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తి చేతిలో ఈవీఎంల కారణంగా ఓడిపోవడం అని చెప్పటం సిగ్గుచేటు, అజ్ఞానం, హాస్యాస్పదం.
టీడీపీ+ జనసేన పార్టీలు ఆకాంక్షిస్తున్నట్లుగా ఇప్పటికిప్పుడు నరేంద్ర మోదీ ఏపీలో జగన్ పాలన రద్దు చేసేస్తారా అంటే అది అసాధ్యం. కాశ్మీర్ సమస్య దేశ భద్రతకు సంబంధించింది. పుల్వామా ఉగ్రదాడిలో ఏకంగా సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దేశ భద్రత నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. అది కేంద్ర ప్రాలిత ప్రాంతం అయినా ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజలు ఎన్నుకోవాల్సిందే.
ఇక ఏపీ పూర్తిగా భారత రాజ్యాంగ బద్ధంగా పాలింపబడే రాష్ట్రం ఇక్కడ ప్రభుత్వాల రద్దు అసాధ్యం. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పెత్తనానికి నైతికత ఉండదు.
అలా కాకుండా ఇంకోలా అయితే, మిగతా రాష్ట్రాల లాగా ఏపీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలను బీజేపీ తనలో కలుపేసుకొని జగన్ సర్కార్ కు ముప్పు కలిగిస్తారా? అంటే ఇది కూడా అసాధ్యం. ఎందుకంటే బీజేపి తాను సొంతంగా బలపడాలనుకుంటుందే గానీ, ఇప్పటికిప్పుడు జగన్ ఎమ్మెల్యేలను లాగేసుకుకొని. టీడీపీకి లాభం చేయాలనుకుంటుందా? నాలుగు ఏళ్లగా చంద్రబాబు తమతో ఉండి, గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో జతకూడి మోదీ, అమిత్ షాల ఓటమి కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసి బోల్తాపడిన చంద్రబాబును బీజేపీ మరిచిపోతుందా? ఇటు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో బీజేపికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారే. ఆయన ప్రచారంలో పెద్దగా టీడీపీని వ్యతిరేకించలేదు. అప్పట్నించీ ఇప్పటివరకూ కూడా టీడీపీ 'బీ' టీంగా జనసేన వ్యవహరిస్తుందే తప్ప సొంత విధానపరమైన సిద్ధాంతాలేమి లేవు.
ఇక ఇప్పుడు చంద్రబాబు, మోదీ మద్ధతు కోరే పరిస్థితుల్లో లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ మోదీ మద్ధతు కోరగానే, ఆయన వెంటనే వారి ఆకాంక్షలను అమలు పరుస్తారా? ఈ మాత్రం రాజకీయాలు దేశాన్నే నడిపిస్తున్న వ్యక్తులకు తెలియదా? పోనీ ఇక్కడ సీఎం జగన్ కూడా మోదీకి గానీ, కేంద్రానికి గానీ వ్యతిరేకంగా వెళ్తున్నాడా అంటే అదీ లేదు. కేవలం ఏపీలోని రాజకీయ పార్టీలే ఏపీలో ఏదో జరిగిపోతుందనే ప్రచారం, ఒక భయాందోళనలు సృష్టించడం తప్పా, అంతా ప్రశాంతమే.
కాకపోతే, ఈ వ్యవహారాన్నంతా ఢిల్లీ పెద్దలు ఒక కన్నేసి ఉంచుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ కు సంబంధించిన ప్రతీ విషయం ఎవరూ మోసుకొచ్చినా కేంద్ర పెద్దలు వింటారు. తమకు అవసరమైనప్పుడు, తాము లబ్ది పొందే సమయంలో అవి ఉపయోగించుకుంటారు. అంతే తప్ప మోదీ, అమిత్ షాలను కలిసినంతా మాత్రాన. జగన్ సర్కార్ కు ఏదో అపాయం ముంచుకురాదు.
అంతటి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి పాలన చేజారిపోయినా, చివరి రోజు, చివరి క్షణం వరకు సీఎం కూర్చీని వదలకుండా ఉన్నారు తప్పా, ఆయనకు ఎలాంటి కష్టం కలుగలేదు. ఒక సీఎం స్థాయి వ్యక్తికి తన రాష్ట్రంలో అంత పవర్ ఉంటుంది. అలాంటిది కొన్నేళ్ల పాటు ప్రజల్లోనే తిరిగి, తిరుగులేని విజయంతో బలంగా ఉన్న సీఎం జగన్ కు ఇంకా ఎంత పవర్ ఉండాలి? మొన్న సిక్కిం రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రతిపక్షం వద్దే ఆగిపోగిపోయింది కానీ, పవర్ లోకి రాలేదు. ఎందుకంటే అలా వస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఒక రాజ్యంపై మరొకరు దండెత్తి దురాక్రమించడం అనిపించుకుంటుంది. కర్ణాటకలో మిగతా అన్ని పార్టీల కంటే ఎన్నికల్లో బీజేపీనే ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి "సంకీర్ణ" ప్రభుత్వాన్ని (కాంగ్రెస్ + కుమార స్వామి) ని పడగొట్టి అది అధికారంలోకి రాగలిగింది.
అందుచేత జగన్ కు ఏపీ ప్రజలు 5 సంవత్సరాల పాటు అధికారాన్ని కట్టబెట్టారు. అప్పటివరకు ప్రతిపక్ష పార్టీలుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలే గానీ, హెచ్చరికలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. సీఎం జగన్ కూడా అమరావతి విషయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. తమ ప్రభుత్వ ఆలోచన ఏమిటి? ఒకవేళ రాజధానిని తరలిస్తే కలిగే లాభ, నష్టాలను ప్రజలకు వివరించే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. ఆ దిశగా సీఎం జగన్ ముందుకు వెళ్లాలి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)