Maharashtra Political Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ప్రమాణ స్వీకారం తర్వాత క్యాబినెట్ విస్తరణ, వివరాలను వెల్లడించిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
Mumbai, June 30: గతకొద్ది రోజుల నుంచి సూపర్ థ్రిల్లర్‌ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు తాజాగా కొత్త ట్విస్ట్‌తో మరింత రసవత్తరంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగా (Maharashtra CM) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రకటించారు.
ఇవాళ ఇద్దరూ గవర్నర్ కోశియారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, సావార్కర్ విధానాలకు వ్యతిరేకంగా శివసేన కూటమి ఏర్పాటు చేసినట్లు ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రజల తీర్పును ఆ పార్టీ అవమానించినట్లు ఫడ్నవీస్ తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత క్యాబినెట్‌ను విస్తరించనున్నట్లు ఫడ్నవీస్ చెప్పారు. దీంట్లో బీజేపీ, శివసేన నేతలు ఉండనున్నారు. తాను ప్రభుత్వంలో ఉండడం లేదన్నారు.
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారిని కలిశారు. రాజ్‌భవన్ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌తో ముచ్చటించారు. ఫడ్నవీస్, షిండేలకు గవర్నర్ కోశియారి స్వీట్లు తినిపించారు.
నిన్న అకస్మాత్తుగా సీఎం ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేయడంతో మహా రాజకీయాలు (Maharashtra Political Drama) కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఉద్దవ్ రాజీనామా నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన బలపరీక్షను అసెంబ్లీ సెక్రటరీ రద్దు చేశారు. బాలాసాహెబ్ హిందుత్వా వాడానికి తాము కట్టుబడి ఉన్నట్లు ఏక్‌నాథ్ తెలిపారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.