Utpal Parrikar Quits BJP: గోవాలో బీజేపీ భారీ షాక్, పార్టీని వీడిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన
స్వతంత్ర అభ్యర్థిగా పణాజీ (Panaji) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లైంది. ‘గతంలో, ఇప్పుడు… మా పార్టీని ఒప్పించడానికి శతధా ప్రయత్నాలు చేశాను. అయినా పణాజీ టిక్కెట్ తెచ్చుకోలేకపోయాను.
Panaji January 21: గోవా ఎన్నికల(Goa Elections) ముందు బీజేపీకి గట్టి షాక్ తగిలింది. గోవా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పునాదులు పటిష్ఠం కావడంలో తీవ్ర కృషి చేసిన మనోహర్ పారికర్(Manohar Parrikar) కుమారుడు ఉత్పల్ పారికర్ (Utpal Parrikar) బీజేపీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పణాజీ (Panaji) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లైంది. ‘గతంలో, ఇప్పుడు… మా పార్టీని ఒప్పించడానికి శతధా ప్రయత్నాలు చేశాను. అయినా పణాజీ టిక్కెట్ తెచ్చుకోలేకపోయాను. నాకు కాకుండా అవకాశవాదం కోసం పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చారు. అందుకే నేను ముందుకే కదులుతున్నాను. నా రాజకీయ భవిష్యత్తును పణాజీ ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పటి వరకూ పార్టీ నేతలే కాకుండా పణాజి ప్రజలు కూడా ఎంతో మద్దతిచ్చారు’ అని ఉత్పల్ పారికర్ పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా ఉత్పల్ వ్యవహారం బీజేపీ(BJP)లో నలుగుతూనే వుంది. తాను ఎలాగైనా పణాజీ నుంచే బరిలోకి దిగుతానని ఉత్పల్ భీష్మించుకుంటుంటే, అలా కుదరదని బీజేపీ అంతే భీష్మించుకు కూర్చుంది. పైగా.. ఓ మాజీ సీఎం కుమారుడైనంత మాత్రాన టిక్కెట్ ఇవ్వాలా? అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించింది. దీంతో వ్యవహారం ముదిరింది. అంతేకాకుండా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అందులో ఉత్పల్ పేరు లేదు. పణాజి నుంచి ఉత్పల్ పేరు కాకుండా అటానాసియో మోన్సరేట్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది.ఈయన పణాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఉత్పల్‌కు రెండు ఆప్షన్‌లు ఇచ్చామని, మొదటి దానిని తిరస్కరించారని, రెండో దానిని ఒప్పుకుంటారన్న నమ్మకం తమకుందని గోవా వ్యవహారాల ఇన్‌చార్జీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
అయితే బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో పనిచేయాలంటూ అధిష్ఠానం ఆఫర్ కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను పార్టీ నిర్మాణంలోకి తీసుకుంటామని బీజేపీ పెద్దల భావనగా వార్తలొచ్చాయి. అయితే దీనికి ఉత్పల్ అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం.
బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఉత్పల్ పారికర్(Utpal Parrikar) పేరు లేకపోవడంతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Aravind Kejriwal) స్పందించారు. ఉత్పల్‌ను ఆప్ (AAP)లోకి ఆహ్వానిస్తున్నామని, పోటీ చేయడానికి అవకాశం కూడా కల్పిస్తామని ప్రకటించారు. గోవాలో బీజేపీ పాతుకుపోవడంలో మనోహర్ పారికర్ పాత్ర ఎంతో వుందని, బీజేపీ వాడుకొని వదిలేసే ప్రక్రియలో ఉందని అరవింద్ ఘాటుగా విమర్శించారు. ఇక.. శివసేన(Sivsena) కూడా స్పందించింది. ఉత్పల్ గనక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే, తాము కచ్చితంగా మద్దతిస్తామని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు.