Case File On Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు, దాడి ఆరోపణలు అబద్దమంటూ కొట్టి పారేసిన ఎమ్మెల్యే, వైసిపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ, గత పాలన అరాచకాలను గుర్తు చేస్తున్న వైసీపీ
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Nellore, October 5: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లూరిపల్లిలో ఉన్న సరళ ఇంటి వద్దకు వెళ్లిన కోటంరెడ్డి... నీటి పైపు లైను ధ్వంసం చేశారని, విద్యుత్ సరఫరాను నిలిపివేశారని ఆయనపై కేసు నమోదు అయింది. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలపై సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. ఒక వెంచర్ కు సంబంధించి అనుమతి ఇవ్వలేదని తనపై దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపణలు చేస్తున్నారన్న దాన్ని ఆయన కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు అబద్ధమని జరిగిన సంఘటనను దగ్గరగా చూస్తే మీకే నిజాలు తెలుస్తాయన్నారు. లే అవుట్ కి మూడు నెలలుగా వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నేను ఎంపీడీవో సరళ గారికి ఫోన్ చేసిన మాట వాస్తవమేనని అన్నారు. వాటర్ కనెక్షన్ ఇవ్వొచ్చుగా అని తాను అడిగితే, ఎమ్మెల్యేగారు ఇవ్వొద్దంటున్నారని ఆమె చెప్పారని అయితే ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే దాంట్లో వేరే ఉందిలే, నీతో మెల్లిగా మాట్లాడతానులే అని ఆ ఎమ్మెల్యే చెప్పారని ఇంతవరకు నాతో మాట్లాడలేదన్నారు. ఇంటికి కరెంట్, నీటి సరఫరా లేకుండా కట్ చేశారన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ, కరెంట్, నీటి సరఫరాను ఎమ్మెల్యే కట్ చేస్తారా? ఎవరైనా ఆ పనులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీడీవో ఇంటికి తాను వెళ్లి దౌర్జన్యం చేసినట్టు వస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చ పెడదామని అందుకు సిద్ధమేనా? అని సవాల్ ప్రశ్నించారు.
ఈ విషయం మీద ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మహిళా అధికారిణిని వైసీపీ ఎమ్మెల్యే హింసిస్తుంటే రాష్ట్ర అధికారులు, ఎంపీడీవో సంఘాలు ఏమి చేస్తున్నాయని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీగా ఉన్నందుకు ఓ మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడవా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కూడా కరువైందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలను తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని... ఇప్పుడు మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే వైసిపి నేతలు కూడా వారికి ధీటుగానే బదులిస్తున్నారు. గత పాలనలో మీ ఎమ్మెల్యే ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చుకుని వెళుతుంటే వీరంతా మాట్లాడుకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.