Rajinikanth: సీఎం కాబోయేది అతడే! పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజినీకాంత్, తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని వ్యాఖ్య
వాస్తవానికి, నేను అసెంబ్లీలో కూర్చుని పాలనాపరమైన వ్యవహారాలు చక్కబెట్టడం లాంటి వాటిపై కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. నేను పార్టీని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేతగా మాత్రమే వ్యవహరిస్తాను. అయితే....
Chennai, March 12: తమిళ సూపర్ స్టార్ మరియు ఇప్పటికీ ఔత్సాహిక రాజకీయ నాయకుడు రజనీకాంత్ (Rajinikanth) గురువారం తన రాజకీయ రంగ ప్రవేశంపై (Political Entry) మరోసారి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే పార్టీ పెడుతున్నట్లు ఆయన ప్రకటించిన ఆయన, సీఎం పదవిపై మాత్రం తనకు వ్యామోహం లేదని పేర్కొన్నారు. గురువారం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన రజనీకాంత్, తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదని, రాజకీయాల్లో మార్పు, వ్యవస్థలో మార్పు మాత్రమే కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని రజినీ అభిప్రాయపడ్డారు.
లీలా ప్యాలెస్ హోటల్‌లో అభిమానులను, రజిని మక్కల్ మండలం (ఆర్‌ఎంఎం) సభ్యులను, మీడియాను ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోలేదు. వాస్తవానికి, నేను అసెంబ్లీలో కూర్చుని పాలనాపరమైన వ్యవహారాలు చక్కబెట్టడం లాంటి వాటిపై కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. నేను పార్టీని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేతగా మాత్రమే వ్యవహరిస్తాను. ఎవరైనా విద్యావంతుడు, దూరదృష్టి గలవాడు, పాలించగలిగే వ్యక్తి సీఎం అవుతారు. పార్టీ అధినేతగానే ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తాను, పాలనలో జోక్యం చేసుకోము. కానీ ఏదైనా తప్పు జరిగితే ముందుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది సొంత పార్టీ నేతలే" అని రజినీ వ్యాఖ్యానించారు. పార్టీలో తన పాత్ర ఓ కంపెనీ సీఈఓగా ఉంటుందని చెప్పుకొచ్చారు. హింసాకాండతో సమస్యలు సమసిపోవు.. సీఏఏపై రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు
ఇంకా మాట్లాడుతూ " పార్టీని లాంచ్ చేసే సమయంలో కూడా మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నన్ను నేను ప్రెసెంట్ చేసుకోను, పార్టీ అధినేతగా మాత్రమే చూపించుకుంటాను. యువకుడు, సమాజం పట్ల మంచి ఆలోచనలు కలిగినవాడు, గొప్ప ఆశయాలు మరియు ఆత్మ గౌరవం ఉన్నవాడు మా పార్టీ సీఎం అభ్యర్థిగా ఉంటారు. అది ఎవరైనా కావొచ్చు, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు, న్యాయమూర్తులు, సంఘంలో మంచి పేరు కలవారు లేదా గుణవంతులు ఉంటారు. రాజకీయాలకు కొత్త రక్తం కలిగిన వారిని మేం అణ్వేషిస్తున్నాం. అందుకు మా పార్టీ ఒక సాధనంగా సహాయ పడుతుంది అని నేను ఆశిస్తున్నాను" అని రజినీ అన్నారు. 40 ఏళ్లుగా సినీపరిశ్రమలో పనిచేసిన తనకు, అందులో సంపాదించుకున్న పేరు-ప్రతిష్ఠలు చాలు అని రజినీకాంత్ పేర్కొన్నారు.
తాను స్థాపించబోయే పార్టీలో 60-65 శాతం యువతకే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తన వయసు ఇప్పుడు 68 ఏళ్లు అని చెప్పుకున్న రజినీ తనకీ వయసులో ఎలాంటి పదవులు అవసరం లేదని పునరుద్ఘాటించారు. తాను సీఎం అభ్యర్థిని కాదని, సీఎం అభ్యర్థిని తయారు చేస్తానని ప్రజలకు తెలియజెప్పడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని రజినీకాంత్ వెల్లడించారు.
అయితే రాజకీయ పార్టీ లాంచ్ ఎప్పుడనే విషయంపై రజినీకాంత్ మరోసారి క్లారిటీ ఇవ్వకుండా దాటవేశారు. రాజకీయాల్లోకి రావాలనే కోరికను 2017 డిసెంబర్ 31 న ప్రకటించిన ఆయన, ఆ తర్వాత తన రాజకీయ రంగప్రవేశంపై ఇప్పుడూ, అప్పుడూ అంటూ ఊహాగానాలకే పరిమితమైంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.