Amit Shah Interview: NRCకి మరియు NPRకి మధ్య ఎలాంటి సంబంధం లేదు, దీనివల్ల ఎవరి పౌరసత్వానికి భంగం వాటిల్లదు, భరోసా ఇస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్షాల దుష్ప్రచారంపై ఆగ్రహం
కాబట్టి దీనికి మైనారిటీలు భయపడాల్సిన అవసరం లేదు". అని అమిత్ షా చెప్పారు.
New Delhi, December 24: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) మరియు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) ఒకదానితో ఒకటి సంబంధం లేనిదని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. "నేను స్పష్టంగా చెబుతున్నాను, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ మరియు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మధ్య ఎటువంటి సంబంధం లేదు, " అని అమిత్ షా అన్నారు, ఎన్‌పిఆర్‌లో సేకరించబడే డేటా పాన్-ఇండియా ఎన్‌ఆర్‌సికి ఏ విధంగా ఉపయోగించబడదని షా పేర్కొన్నారు.
అసలు దీనిపై చర్చ కూడా అవసరం లేదని, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ద్వారా పేదవారికి, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమిత్ షా సమర్థించారు. ఎన్‌ఆర్‌సిపై ఇంతవరకు కేబినెట్ లో గానీ, లేదా పార్లమెంటులో గానీ చర్చ జరగలేదు అని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఎన్‌పిఆర్ అప్‌డేషన్ ప్రక్రియ ద్వారా ఏ పౌరుడి జాతీయ హోదాకు ఎలాంటి భంగం కలగదు. ఎన్‌పిఆర్ కోసం చేపట్టే సర్వేలో మీరు దేశ పౌరులేనా? అనే ప్రశ్నలు ఉండవని అమిత్ షా పేర్కొన్నారు. ఒకవేళ ఎన్‌పిఆర్ నుంచి పేర్లు తప్పిపోయినా, అది వారి పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. 2010లో యూపీయే హయాంలో చేపట్టిన ప్రక్రియనే ఇప్పుడు మరోసారి చేపడుతున్నాం, అప్పుడు ప్రశ్నించలేని వారు, ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్‌ఆర్‌సి మరియు ఎన్‌పిఆర్ రెండూ వేర్వేరు ప్రక్రియలు. ఎన్‌పిఆర్ వల్ల ఎవరూ పౌరసత్వం కోల్పోరు. అలాగే నిర్భంధ కేంద్రాలకు కూడా ఎవరిని తరలించడం లేదు అని అమిత్ షా నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా నిర్బంధ కేంద్రాల గురించి హోంమంత్రి వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ "నిర్బంధ కేంద్రాలకు తరలింపు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎవరైనా ఒక విదేశీయుడిని సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంతో అరెస్ట్ చేసినపుడు, అతణ్ని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారు. పూర్తి విచారణ జరిపిన తర్వాత అతణ్ని దేశం నుంచి పంపించి వేస్తారు. అయితే నిర్బంధ కేంద్రాలకు ఎన్‌ఆర్‌సితో ఎటువంటి సంబంధం లేదు అని షా చెప్పారు. తమ ప్రభుత్వం ఇంతవరకూ ఎవరిని నిర్భంధ కేంద్రాలకు తరలించలేదని అమిత్ షా తెలిపారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సి జాబితాలో పేర్లు కోల్పోయిన వారు కూడా ఇప్పటికీ తమతమ ఇళ్లల్లోనే ఉంటునారని పేర్కొన్నారు. అస్సాంలో ఒకే ఒక నిర్బంధ కేంద్రం ఉంది, అది కొన్నేళ్లుగా ఉంది. ప్రధాని మోదీ హయాంలో ఇంతవరకూ ఒక్క నిర్బంధ కేంద్రం నిర్మించబడలేదు అని షా స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంపై విమర్శల గురించి అడిగినప్పుడు, షా బదులిస్తూ: "ఒకరి పౌరసత్వంను రద్దు చేసే నిబంధన CAA లో చేర్చబడలేదు, CAA అనేది పౌరసత్వాన్ని కల్పించడానికే నిర్ధేషించబడినది. కాబట్టి దీనికి మైనారిటీలు భయపడాల్సిన అవసరం లేదు". అని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో భయాలు తగ్గుతున్న సమయంలో ఇప్పుడు కొన్ని ప్రతిపక్ష పార్టీలు NPRపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించాయి. దీని ద్వారా మైనారిటీలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందవు అని చెబుతూ లేని భయాలను కల్పిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.