PC Chacko Quits Congress: కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ, పార్టీకి రాజీనామా చేసిన పీసీ చాకో, వర్గ విభేదాలు, నాయకత్వ లేమితో కొనసాగలేని పరిస్థితి నెలకొని ఉందని తెలిపిన మాజీ ఎంపీ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి లిస్టును ప్రకటించిన సీపీఎం
ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా (PC Chacko Quits Congress) చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి ఉందన్నారు. పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
New Delhi, March 10: కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా (PC Chacko Quits Congress) చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి ఉందన్నారు. పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
గతంలో కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఆయన ఇవాళ ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. చాకో రాజీనామా కీలకంగా మారింది.
ఏడాదికి పైగా పార్టీకి అధ్యక్షుడే లేడని, కొత్త అధ్యక్షుడిని తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా జరగలేదని, తలలేని పార్టీగా పనితీరు ఉందని చాకో అన్నారు. రాహుల్‌తో సహా పార్టీ అధిష్ఠానాన్ని ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. కేరళలో కాంగ్రెస్ అనేదే లేకుండా పోయిందని, ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా విఫలమయ్యానని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ రోజురోజుకూ కనుమరుగవుతోందని, ఇందుకు నిరసనగానే తాను పార్టీకి రాజీనామా ఇచ్చానని చెప్పారు.
కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం అనేది మిగలలేదని కూడా ఆయన వాపోయారు. అభ్యర్థుల జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని తెలిపారు. కేరళలో బీజేపీ పెద్దగా లబ్ధి పొందేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, విద్యార్థి నేతగా కెరీర్ ప్రారంభించిన చాకో కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఏఐసీసీ స్థాయికి ఎదిగారు. కేరళ మంత్రిగా పని చేశారు. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు (Kerala Assembly Elections 2021) జరగనున్నాయి. కేరళలో కీలకమైన ఎన్నికలు జరగనున్నాయని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని, కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా (Rampant Groupism) విడిపోయినట్లు ఆయన ఆరోపించారు. ఇదే అంశాన్ని అధిష్టానంతో చర్చించినట్లు ఆయన చెప్పారు. కానీ ఆ రెండు గ్రూపులు ఇస్తున్న ప్రతిపాదనలను హైకమాండ్ అంగీకరిస్తోందని, దీని వల్ల కేరళలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని ఆయన అన్నారు. కోఆర్డినేషన్ కమిటీలు రెండుగా పనిచేస్తున్నాయని, దీన్ని వెంటనే ఆపేయాలన్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ సీపీఎం(మార్కిస్టు) పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్యర్థులతో తొలి లిస్టును ప్రకటించారు. సీఎం పినరయి విజయన్ ఈసారి ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి కేకే శైలజా.. మట్టన్నూర్, తవనూర్ నుంచి కేటీ జలీల్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి విజయరాఘవన్ వెల్లడించారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని జాబితాను తయారు చేసినట్లు విజయరాఘవన్ తెలిపారు.
కూటమి అభ్యర్థుల కోసం ఈసారి సీపీఎం ఏడు సీట్లను వదులుకున్నది. దాంట్లో అయిదు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. సీపీఎం తమ అభ్యర్థుల్లో 12 మంది మహిళలకు స్థానం కల్పించారు. మంజీశ్వరం, దేవీకులమ్ స్థానాలకు ఆ పార్టీ ఇంకా పేర్లను ప్రకటించలేదు. ప్రకటించిన 83 మందిలో 74 మంది సీపీఎంకు చెందినవారు కాగా మరో 9 మంది ఆ పార్టీ మద్దతు ఉన్నవారు పోటీచేయనున్నారు.