TRS Office in New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయ భవనానికి భూమి పూజ చేసిన కేసీఆర్, మూడు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీకానున్న టీఎస్ సీఎం
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది దసరా నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి వివిధ జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు....
New Delhi, September 2: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ చరిత్రలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దేశ రాజధాని న్యూఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో సుమారు 1300 గజాల స్థలంలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం గురువారం వేదమంత్రోచ్ఛరణల మధ్య సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం మరియు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది దసరా నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి వివిధ జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇది పూర్తయితే ఢిల్లీలో సొంత కార్యాలయ భవనాలు కలిగిన కొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ చేరినట్లు అవుతుంది.
Check this update:
కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెతిస్తుంది. తమ ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో గడపనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే కేసీఆర్ అవకాశం ఉంది. అయితే, ప్రధాని మోదీతో సీఎం భేటీకి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణకు చెందిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర సంబంధిత సమస్యలకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యలపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కేసీఆర్ కలవనున్నారు.