IPL Auction 2025 Live

Telangana RTC: టీఎస్ ఆర్టీసీ భవితవ్యంపై తేల్చేయనున్న సీఎం కేసీఆర్, నవంబర్ 02న కేబినేట్ భేటీ, ముందుగా అనుకున్నట్లే కొత్త ఆర్టీసీ పాలసీ వైపే మొగ్గు, సమ్మెపై డోంట్ కేర్

అదే సమయంలో ఆర్టీసీ సమ్మె, కార్మిక సంఘాల నాయకులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు....

TSRTC Strike | CM KCR Review | File Photo

Hyderabad, October 31: తెలంగాణ ఆర్టీసీ (TS RTC) ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) స్పీడప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు నవంబర్ 02న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రగతి భవన్ లో మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణ ఆర్టీసీ భవితవ్యమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను అమలులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా నిర్ణయించిన విధంగా కొత్త ఆర్టీసీ పాలసీ విధానంపై తెలంగాణ కేబినేట్ చర్చించనుంది. 50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రైవేట్ బస్సులు నడపాలనేది సర్కార్ ఆలోచన, దీనిపై విధివిధానాలు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే అద్దెబస్సుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వడంపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణలోని బస్ స్టాండుల్లో ప్రైవేట్ బస్సులు సర్వీసులు అందించడం ప్రజలు చూస్తున్నారు. వీటి సంఖ్య పెంచే అవకాశం ఉంది. మంత్రివర్గం ఈ కొత్త ఆర్టీసీ పాలసీపై ఆమోదముద్ర వేస్తే తెలంగాణ ఆర్టీసీ కొత్తరూపు సంతరించుకోనుంది.

ఇక 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సీఎం పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కార్మిక సంఘాలు ఎంత పోరాటం చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ వెనకడుగు వేసే అవకాశం కనిపించడం లేదు. వారితో తాడోపేడో తేల్చుకోవటానికే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. హైకోర్ట్ అభ్యంతరాలు చెప్తే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి లైన్ క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ ఆలోచన ఇదేనా?

ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను కేవలం ఒక రాజకీయ సమ్మెగానే సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వాదిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీనే ఇందులోకి లాగాలనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుంది.

సీఎం కేసీఆర్ చెప్తున్న ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నూతన రవాణా సవరణ చట్టం 2019ను ప్రవేశపెట్టింది. ఆ చట్టం ప్రకారం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రవాణా వ్యవస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టాన్నే తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అని చెప్పుకునే వీలుంది.

ఆర్టీసీ అంశం హైకోర్టు దాటి సుప్రీంకోర్టుకు వెళ్తే, గతంలో 2003లో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత సీఎంగా వ్యవహరిస్తున్న సమయంలో అక్కడ కూడా ఇలాగే ఆర్టీసీ సమ్మె మొదలైంది. అప్పుడు సీఎం జయలలిత దాదాపు లక్షా యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి, వారిని విధుల నుంచి తొలగించింది. ఆనాడు ఆర్టీసీ కార్మికుల వ్యవహారం మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అప్పుడు సుప్రీంకోర్ట్ కూడా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేసే హక్కు లేదని తేల్చిచెప్పడంతో ఇక కార్మికులంతా చేసేదేం లేక మళ్ళీ ఉద్యోగాల్లో చేరిపోయారు.

ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే విధానంలో వెళ్తున్నారు, ఈసారి ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం కూడా బలమైన ఆయుధంగా లభించింది. కాబట్టి ఎలా చూసుకున్నా, ప్రభుత్వానికే అనుకూల వాతావరణం కనిపించడం, ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు మినహా పెద్ద ఎన్నికలు లేకపోవడం, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు దూరమైనా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకుంటున్న అశేష ప్రజానీకం తనవైపే ఉన్నారనే నమ్మకంతో కేసీఆర్ ఆర్టీసీ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉద్యోగాల్లో చేరాలనుకునే కార్మికులు డిపోలో దరఖాస్తు పెట్టుకొని తిరిగి ఉద్యోగాల్లో చేరొచ్చనే ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో ఆర్టీసీ సమ్మె, కార్మిక సంఘాల నాయకులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.