File Image of Telangana CM KCR | File Photo

Hyderabad, October 07: టీఎస్ ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) నేపథ్యంలో నిన్న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ (CM K. Chandrashekhar Rao) సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో మరోసారి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ముఖ్యంగా  సునీల్ శర్మ కమిటీ ప్రతిపాదించిన అంశాలపైనే చర్చ జరిగింది. నూతన ఆర్టీసీ పాలనకు సంబంధించి విధివిధానాలపై కేసీఆర్ చర్చించారు.  ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అది వివేకమైన చర్య కాదని ఆయన స్పష్టంచేశారు, అయితే ముందుగా అనుకున్నట్లుగా కొంతవరకు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి అన్నట్లుగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

ఉద్యోగులు తామంతట తామే ఉద్యోగాలు కోల్పోయారు (Self Dismissed), ఇక్కడ ప్రభుత్వం ఏమి వారిని విధుల నుంచి తొలగించలేదు, చట్టవ్యతిరేక సమ్మెకు లోబడి చట్టం ప్రకారమే ఉద్యోగాలు పోగొట్టుకున్నారని తెలియజేశారు. ఇకపై ఆర్టీసీలో యూనియన్లు ఉండవు అని తెలియజేశారు.

ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది కేవలం 1200 మాత్రమే. వీరు తప్ప విధుల్లోంచి తొలగిపోయిన మిగితా వారందరూ డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకూడదు, వారిని నియంత్రించడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.  ప్రస్తుతం విధులు నిర్వర్తించే ఈ 1200 మందిపై కూడా ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీకి దిశానిర్ధేశం చేశారు.

ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి. దాన్ని లాభాల్లో నడిచే సంస్థగా రూపుదిద్దాలి. ఏదేమైనా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు. ఆ దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

కొత్త ఆర్టీసీ పాలసీ ప్రకారం ప్రాథమిక విధివిధానాలు ఇలా ఉండబోతున్నాయి

తెలంగాణ ప్రభుత్వ కొత్త పాలసీ ప్రకారం ఇకపై  50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రైవేట్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం కింద విభజించనున్నారు.

అయితే అన్ని బస్సులను పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని ఆర్టీసీ డిపోలలోనే ఉంచనున్నారు. ముందుగా చెప్పినట్లుగా 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేట్ వి, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తారు. అంటే వీటిని కూడా బస్ స్టేషన్ లోపలికి అనుమతించడం జరుగుతుంది.   అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా నడపాలి.  టీఎస్ ఆర్టీసీ నిల్, ప్రైవేట్ ఫుల్!

ప్రైవేట్ బస్సుల చార్జీలు కూడా ఆర్టీసీ బస్ చార్జీలతో సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయి. ఆర్టీసీ టికెట్ ధరలు పెంచినప్పుడే వాటి ధరలు పెంచడం జరగాలి. కొద్ది మొత్తం పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ ఆమోదం తీసుకున్నాకే పెంపు ఉండాలి. ఇప్పటికీ 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే అని ప్రభుత్వం వివరించింది.

బస్ పాసులు ఎప్పట్లాగే కొనసాగుతాయి

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగులు, తదితరులకు సబ్సిడీ బస్ పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అందుకు అవసరమయ్యే నిధులు బడ్జెట్లో కేటాయించడం జరుగుతుంది సీఎం స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి సంబంధించి హైలైట్స్

• ఆర్టెసీ యూనియన్ల సమ్మె దురహంకారపూరితమైన చర్య, తమ చేతుల్లోనే గుత్తాధిపత్యం ఉండాలి అనే రీతిలో యూనియన్స్ వ్యవహరిస్తున్నాయి.

• ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ సంస్థలో ఏది జరిగినా అది ప్రభుత్వ అనుమతితోనే జరగాలి

• పండుగలు పరీక్షలు వంటి కీలక సమయాల్లో కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపిచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇకపై అలాంటివి రూపుమాపి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి

• ఆర్టీసీ సిబ్బంది సంస్థ నుంచి వైదొలగడంతో ఇక వారి యూనియన్లు కూడా కనుమరుగైనట్లే . యూనియన్లు వాటి అస్థిత్వాన్ని కోల్పోయాయి

• భవిష్యత్ లో ఇక ఆర్టీసీలో యూనియనిజం వుండదు

• భవిష్యత్ లో ఆర్టీసీ అంటే ఒక అద్భుతమైన సంస్థగా రూపుదిద్దుకోబోతుంది.

• ఆర్టీసీ భవిష్యత్తులో లాభాలకు వచ్చి ఇక ముందు కొత్తగా చేరబోయే కార్మికులకు బోనస్ ఇచ్చే పరిస్థితికి రావాలి.

• ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలి, సంస్థ లాభాల్లో నడవాలి, నష్టాల్లోకి పోకూడదు

• ఆర్టీసీ నిరంతరం చైతన్యంతో ప్రజలకు సేవలు అందించే సంస్థ. రవాణా రంగంలో రోజు రోజుకూ పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థగా దేశంలోనే పేరుగాంచిన ఆర్టీసి సంస్థ, తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆర్థిక పరిపుష్టిని సాధించుకుని లాభాల బాట పయనించడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సూక్ష్మ ద్రుష్టి సారించాల్సిన అవసరమున్నది

• ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రసంసిస్తున్నారు