Huzurabad By-poll: హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఈనెల 16న దళిత బంధు ప్రారంభ సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు ప్రమోట్ చేయనున్న సీఎం కేసీఆర్
ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గెల్లు శ్రీనివాస్ ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం....
Hyderabad, August 11: హుజూరాబాద్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసెఆర్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేంధర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరిన ఈటల రాజేంధర్ ఇప్పటికే కమలం పార్టీ తరఫున ప్రచారం కొనసాగిస్తున్నారు, అయితే టీఆర్ఎస్ నుంచి ఈటలకు పోటీగా ఎవరు నిలబడతారనే దానిపై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఇతర పార్టీల నుంచి ఇద్దరు ముగ్గురు, ముగ్గురు ప్రముఖ నేతలు ఇటీవల తెరాసలో చేరడంతో వారిలో నుంచే ఎవర్నైనా ఖరారు చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ గెల్లు శ్రీనివాస్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు.
ఈ ఆగస్టు 16న హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 'దళిత బంధు' పథకం ప్రారంభోత్సవ సమావేశాన్ని తెరాస నిర్వహించనుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గెల్లు శ్రీనివాస్ ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.
ఇక, గెల్లు శ్రీనివాస్ యాదవ్ బయోగ్రఫీ చూస్తే, ఈయన 1983 ఆగస్టు 21న కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం హిమ్మత్ నగర్‌లో జన్మించారు. ఈయన తండ్రి మాజీ ఎంపీటీసీ కాగా, తల్లి గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గెల్లు శ్రీనివాస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA మరియు LLB పూర్తి చేసిన ఆయన, అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఈ క్రమంలో పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షునిగా కొనసాగుతున్న గెల్లు శ్రీనివాస్ కు తాజా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కల్పించింది.
ఇక, టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థినే ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థి పేరును ప్రకటిస్తామని తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం తమ పార్టీ తరఫున ఎవర్ని బరిలో దించుతుందో చూడాలి. ఏదైమైనా, హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ కూడా వెలువడకముందే అన్ని రాజకీయ పార్టీలు భారీ ప్రచారాలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.